ఎత్తులు.. పై ఎత్తులు!


సాక్షి ప్రతినిధి, కర్నూలు :

 మంత్రి పదవి కోసం మాజీ మంత్రులు పోటీ పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి రావటంతో జిల్లాలో మళ్లీ చక్రం తిప్పాలని ఇద్దరు మాజీ మంత్రులు తహతహలాడుతున్నారు. ముందునుంచీ టీడీపీలో ఉన్న ఎన్‌ఎండీ ఫరూక్..  కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన టీజీ వెంకటేష్ ప్రస్తుతం ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. ఈ ఇద్దరూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ కోసం పోటీ పడుతూ.. పైరవీలు చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో 2011లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎస్వీ మోహన్‌రెడ్డి విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని వేధించడంతో పదవిని వదులుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగటంతో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. జిల్లాలో టీడీపీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు చక్రం తిప్పుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ నేతలు దౌర్జన్యంగా జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. తాజాగా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికకు టీడీపీకి మెజారిటీ లేదు. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో 1102 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 30 మంది జెడ్పీటీసీ సభ్యులు, 394 మంది ఎంపీటీసీ సభ్యులు, 108 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలుపొందిన వారే. మొత్తం 545 మంది ఓట్లు వైఎస్సార్‌సీపీవే. ఈ లెక్కన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం వైఎస్సార్‌సీపీదే. అయితే వీరిలో ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారిలో కొందరిని టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు సమాచారం. వారి సహకారంతో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. 

 ఎమ్మెల్సీ అయితే మంత్రి పదవి ఖాయం

 టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిస్తే మంత్రి పదవి ఖాయమని తమ్ముళ్లు భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్సీ కోసం మాజీ మంత్రులు ఫరూక్, టీజీ వెంకటేష్ పోటీ పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా గెలుపొందలేదు. దీంతో మైనారిటీ సంక్షేమ శాఖను కూడా ఆ సామాజిక వర్గానికి కట్టబెట్టలేని దుస్థితి నెలకొంది. సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డికి మైనారిటీ శాఖ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లిం అభ్యర్థిని ఎమ్మెల్సీని చేసి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి పదవిని ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. కర్నూలు జిల్లా నుంచి ఎన్‌ఎండీ ఫరూక్‌ని ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌కు ఎమ్మెల్సీ టికెట్ దాదాపు ఖరారైందని టీడీపీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబుకి సన్నిహితుడైన సీఎం రమేష్ ద్వారా టికెట్ ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీగా పోటీ చేసి టీడీపీ మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకుని జిల్లాలో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం. అయితే ఫరూక్ ఎమ్మెల్సీ అయితే ముస్లిం సామాజిక వర్గం నుంచి ఒకరైనా మంత్రివర్గంలో ఉన్నారని చెప్పుకునేందుకు ఉంటుందని టీడీపీ అధినేత భావిస్తున్నట్లు తెలిసింది. అయితే వీరిద్దరిలో ఎమ్మెల్సీ టికెట్ ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి. ఒకవేళ టికెట్ దక్కినా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుస్తారా? లేదా? అనే సందేహం తెరపైకి వస్తోంది.

 

 


 


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top