పాతనోట్లు పట్టివేత

పాతనోట్లు పట్టివేత - Sakshi


► తీగలాగితే..డొంక కదిలింది

► బైక్‌ చోరీ విచారణలో..నోట్లు దొరికిన వైనం

► వివరాలు వెల్లడించిన సీసీఎస్‌ పోలీసులు




పట్నంబజారు(గుంటూరు వెస్ట్‌) : బైక్‌ చోరీపై విచారణ మొదలుపెడితే..పాతనోట్లు పట్టుబడ్డాయి. చోరి అయిన ద్విచక్ర వాహనం కోసం నిఘా ఉంచితే నోట్ల కేటుగాళ్లు దొరికిపోయారు. నగరంపాలెంలోని సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ (సీసీఎస్‌)లో అడిషనల్‌ ఎస్పీ బీపీ తిరుపాల్‌ వివరాలను వెల్లడించారు. ద్విచక్ర వాహనాలు అధికంగా చోరీ అవడంపై ప్రత్యేక దృష్టి సారించిన సీసీఎస్‌ పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సీఐ మధుసూదనరావు ఆధ్వర్యంలో హెచ్‌సీ కరీముల్లా, కానిస్టేబుళ్లు ఎన్‌. సాగర్, వి.అనిల్‌ను బృందంగా ఏర్పాటు చేశారు. ఐటీ కోర్‌ బాలాజీ సాంకేతికంగా అందించిన సమాచారంతో పూర్తిస్థాయిలో నేరస్తులపై దృష్టి సారించారు.



అమరావతి రోడ్డులో ఆలా ఆసుపత్రి వద్ద చోరీ చేసిన ద్విచక్రవాహనం ఉందని తెలిసి వెళ్లిన సీసీఎస్‌ కానిస్టేబుళ్లు అనిల్, సాగర్‌ అక్కడే ఉన్న వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు పారిపోతుండడంతో వెంటాడి పట్టుకుని తమదైన శైలిలో విచారించడంతో ఆసలు విషయాన్ని బయటపెట్టారు. వారిలో విజయవాడ పాయకాపురానికి చెందిన విన్నకోట సాయికుమార్‌ నుంచి ఇప్పటివరకు ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సాయికుమార్‌తో పాటు మంగళగిరి, తిరువూరు, గుంటూరు నగరానికి  చెందిన మునగాళ్ళ రాజేంద్రప్రసాద్, రౌశిం రామకృష్ణ, చిట్టి రామగోపాల్‌శాస్త్రిలను అదుపులోకి తీసుకుని వారి నుంచి 29.90 లక్షల పాతనోట్లు, రూ.4.80 లక్షల కొత్తనోట్లు స్వాధీనం చేసుకున్నారు. కమీషన్‌ ప్రాతిపదికన వీరు పాతనోట్లకు కొత్తనోట్లు మారుస్తుంటారని పోలీసులు చెప్పారు. గతంలో పలు చీటింగ్‌ కేసుల్లో సాయికుమార్, రాజేంద్రప్రసాద్‌ నిందితులుగా ఉన్నట్టు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన  కానిస్టేబుల్‌ అనిల్, సాగర్‌లను అడిషనల్‌ ఎస్పీ తిరుపాల్, డీఎస్పీ పి. శ్రీనివాస్‌ అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top