ఆయిల్‌పై జీసీసీ బాదుడు


సీతంపేట: గిరిజనులకు వెన్నుదన్నుగా నిలిచి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన గిరిజన సహకార సంస్థ(జీసీసీ) పరోక్షంగా వారిపై అధిక ధరల భారం మోపుతోంది. తక్కువ ధరలకే నిత్యావసర సరకులను విక్రయించాల్సిన జీసీసీ మార్కెట్ ధర కంటే అధికంగా వసూలు చేస్తూ గిరిజనులను నిలువుదోపిడీ చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ డిపోల ద్వారా పామాయిల్ సరఫరా ఏడాదిగా నిలిపివేయడంతో అందరూ సన్‌ఫ్లవర్ నూనెలనే వాడుతున్నారు.

 

 సీతంపేట ఏజెన్సీలోని పల్లెలు మారుమూలన ఉండడంతో జీసీసీ డీఆర్‌డిపోల(రేషన్) ద్వారా గిరిజనులకు కావాల్సిన సరుకులను విక్రయిస్తుంటారు. మార్కెట్ ధర కంటే రూపాయి, రెండు రూపాయలు తగ్గించి అమ్మకాలు జరపాల్సిన జీసీసీ ఆ నిబంధనలను తుంగలో తొక్కుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా రిఫైన్డ్ సనఫ్లవర్ ఆయిల్‌ను చెప్పుకోవచ్చు. ఆధార్ నూనె ప్యాకెట్లు లీటర్‌వి కొన్ని డీఆర్‌డిపోల్లో రూ. 81, మరికొన్ని చోట్ల రూ.82 కి విక్రయిస్తున్నారు. సీతంపేటలోని బయట మార్కెట్లో రూ.76కి విక్రయిస్తుండగా, పాలకొండలో రూ. 75కే దొరుకుతోంది.

 

 బయట మార్కెట్ రేటు కంటే జీసీసీ మరో ఐదారు రూపాయలు అధికంగా విక్రయించడం పట్ల గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ ప్యాకెట్‌పై ముద్రిత ధర వంద రూపాయలున్నప్పటికీ హోల్‌సేల్‌గా తక్కువ ధరకే ప్రైవేట్ షాపుల్లో విక్రయిస్తున్నారు. ప్రైవేట్ దుకాణాల కంటే ప్రభుత్వ షాపులో ఎక్కువ ధరలకు విక్రయించడమేమిటని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. హోల్‌సేల్‌గా ఎక్కువ ప్యాకెట్లు బాక్సుల రూపంలో కొనుగోలు చేస్తే రూ.73 లోపే ధర పడుతుందని పలువురు వ్యాపారులే తెలియజేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top