వసూళ్ల దందా

వసూళ్ల దందా


► కేంద్ర మంత్రి వెంకయ్య సన్మానం ఖర్చు కూరగాయల మార్కెట్‌పైన...

► ముందుగా కార్పొరేషన్‌ విభాగాలకు వాటాలు

► ఒక్కో విభాగానికి రూ.3 లక్షల చొప్పున కేటాయింపు

► నగరంలో వసూళ్లకు దిగిన అధికారులు

► కూరగాయల మార్కెట్, బాపూజీ కాంప్లెక్స్‌లలో వసూళ్లు

► లబోదిబోమంటున్న బాధితులు

► పట్టించుకోని ప్రత్యేకాధికారి




సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా మారింది ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని వ్యాపారుల పరిస్థితి. కార్పొరేషన్‌ పరిధిలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా... ఖర్చు మొత్తం అధికారులు వ్యాపారులపై మోపుతున్నారు. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. డబ్బులు కట్టలేక బాధితులు లబోదిబోమంటున్నారు. తాజాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సన్మానం ఖర్చు సైతం వారిపైనే పడింది. ఆ ఖర్చు మీరే భరించాలంటూ అధికారులు ఒంగోలు కూరగాయల మార్కెట్‌పై వేశారు. ఒక్కో షాపు రూ.15 వేలకు తగ్గకుండా ఇవ్వాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. కాదూ... కూడదంటే వచ్చే ఏడాది షాపు ఉండదంటూ బెదిరిస్తున్నట్లు సమాచారం. కూరగాయల మార్కెట్‌లో 200 షాపులకుపైనే ఉన్నాయి. ఈ లెక్కన రూ.15 లక్షలకుపైనే వసూలయ్యే అవకాశం ఉంది. వెంటనే డబ్బులు చెల్లించాలని కొద్ది రోజులుగా అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు బాధితులు ‘సాక్షి’కి తెలిపారు. ఇక బాపూజీ కాంప్లెక్స్‌లోనూ కొంత మేర వసూళ్లకు దిగినట్లు సమాచారం.



ఈ నెల 1న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఆయనకు సన్మానం ఏర్పాటు చేసింది. సన్మాన సభను ఏ1 ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేశారు.  వెంకయ్య సన్మానానికి రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చయినట్లు అధికారులు చెబుతున్నారు. తాము సన్మానం మాత్రమే చేశామని    భోజనాల ఖర్చు స్థానిక ఎమ్మెల్యే భరించాడన్నది అధికారుల వాదన. అయితే ఈ ఖర్చుకు సంబంధించి ఇప్పటికే నగరపాలక సంస్థలోని రెవెన్యూ, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, శానిటేషన్‌ శాఖలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున వాటాలు వేసినట్లు సమాచారం. రూ.3 లక్షలు ఖర్చయితే  రూ.12 లక్షల వసూళ్లు ఏమిటంటూ అప్పట్లోనే సదరు శాఖలకు చెందిన ఇన్‌చార్జులు లబోదిబోమంటూ గగ్గోలు పెట్టారు. ఇంత డబ్బులు మేం ఎక్కడి నుంచి తేవాలంటూ కొందరు బహిరంగంగానే వాదనకు దిగారు. ఉన్నతాధికారి ఒత్తిడితో ఎట్టకేలకు మొత్తం డబ్బులను కార్పొరేషన్‌ అధికారులు ఇప్పటికే చెల్లించినట్లు తెలుస్తోంది.



అయితే చెల్లించిన డబ్బులకు నాలుగింతలుపైగా వసూలు చేసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఒంగోలు కూరగాయల మార్కెట్‌లో వసూళ్లకు దిగారు. ఒక్కో షాపునకు రూ.15 వేలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కార్పొరేషన్‌ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంకయ్య సన్మానానికి రూ.3 లక్షలు ఖర్చు పెట్టి రూ.30 లక్షల వసూళ్లకు దిగడమేమిటని అదే శాఖలోని కొందరు అధికారులే విమర్శలు గుప్పిస్తుండటం గమనార్హం. కార్పొరేషన్‌ అధికారులు అక్రమాలకు తెరలేపినా...ప్రత్యేకాధికారిగా ఉన్న కలెక్టర్‌ ఏమాత్రం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్లలో అక్రమాలతో పాటు వెంకయ్య సన్మానం, అక్రమ వసూళ్ల వ్యవహారంపైనా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ సర్వత్రా వ్యక్తమవుతోంది.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top