రుణమాఫీ ఎప్పుడు బాబూ

రుణమాఫీ ఎప్పుడు బాబూ - Sakshi


రుణమాఫీ కోరుతూ రోడ్డెక్కిన డ్వాక్రా మహిళలు

- జిల్లాలో పలు చోట్ల తహసిల్దార్ కార్యాలయాల ముట్టడి

- తక్షణం డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలంటూ ధర్నాలు

కొవ్వూరు రూరల్ : ‘రుణాలు, వడ్డీలు చెల్లించకండి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం మాఫీ చేస్తానంటూ.. మమ్మల్ని నమ్మించి మా ఓట్లతో గద్దెనెక్కి ఇప్పుడు నట్టేట ముంచుతారా’ అంటూ డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ధ్వజమెత్తారు. రేవును దాటి తెప్పను తలగేసిన చందంగా ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఇప్పుడు పూటకో మాట చెబుతూ ఎంతకాలం మభ్యపెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలను వెంటనే మాఫీ చేయాలని కోరుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మహిళలు రోడ్డెక్కి దర్నాలకు దిగారు.



కొవ్వూరు, చాగల్లు, లింగపాలెం, బుట్టాయగూడెం, వీరవాసరం తదితరచోట్ల తహసిల్దార్  కొవ్వూరు మండలంలో 16 గ్రామాలకు చెందిన దాదాపు వెయ్యి మంది డ్వాక్రా మహిళలు సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు. షరతులు లేని డ్వాక్రా రుణమాఫీని అమలు చేయాలని, ఎన్నికల హామీని నిలబెట్టుకుని మహిళల బంగారు ఆభరణాలపై ఉన్న అప్పులను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ కార్యాలయ ఆవరణలో బైఠాయించారు. సీఐటీయూ కొవ్వూరు డివిజన్ కార్యదర్శి పడాల గంగాధరరావు మాట్లాడుతూ ప్రభుత్వం రుణాలు రద్దు చేయకపోవడంతో డ్వాక్రా మహిళలు పొదుపు చేసిన సొమ్ముల నుంచి బ్యాంకులు వడ్డీని వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.



వాగ్ధానాలు ఇచ్చి నేడు డబ్బులు లేవంటూ తప్పించుకోవాలని చూస్తున్న చంద్రబాబునాయుడిని మహిళంతా సంఘటితంగా నిలదీయాలని పిలుపునిచ్చారు. అనంతరం తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాకు వైఎస్సార్ సీపీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ముదునూరి నాగరాజు ధర్నాకు సంఘీభావం తెలిపారు. సీఐటీయూ నాయకులు దగ్గు రాధాకృష్ణ, దగ్గు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

చాగల్లు తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా


చాగల్లు తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం డ్వాక్రా మహిళలు రుణమాఫీ కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డ్వాక్రా సంఘాల మొత్తం రుణాన్ని మాఫీ చేయాలని, షరతులు విధించవద్దని కోరుతూ నినాదాలు చేస్తూ వినతిపత్రాలు అందజేశారు. సీఐటీయూ నాయకులు కె.కనకదుర్గారావు, కౌలు రైతు సంఘం నాయకులు జుజ్జవరపు శ్రీనివాస్, కంకటాల బుద్ధుడు తదితరులు పాల్గొన్నారు.  

 

లింగపాలెంలో..


లింగపాలెం :  డ్వాక్రా రుణాలను వెంటనే మాఫీ చేయాలని కోరుతూ సోమవారం లింగపాలెం తహసిల్దార్ కార్యాలయం వద్ద మహిళలు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ, డ్వాక్రా మహిళల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నాకు దిగారు. డ్వాక్రా రుణాలను తక్షణమే షరతులు లేకుండా మాఫీ చేయాలని, బ్యాంక్‌ల ద్వారా కొత్త రుణాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. స్త్రీనిధిపై వడ్డీ వసూలును విరమించాలని, డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెట్ పరపతి సౌకర్యం కల్పించాలని కోరారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.శ్యామలారాణి, జిల్లా అన్నపూర్ణ, ఎం.కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top