లాటరీ పేరుతో నర్సుకు రూ. 4.5 లక్షల టోకరా!

లాటరీ పేరుతో నర్సుకు రూ. 4.5 లక్షల టోకరా! - Sakshi


హైదరాబాద్ : లాటరీ గెలిచారంటూ వచ్చిన ఎస్సెమ్మెస్‌ను నమ్మడంతో ఓ స్టాఫ్ నర్స్ రూ.4.5 లక్షల మేర నష్టపోయారు. ఈ కేసు దర్యాప్తు చేసిన సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు ఉగాండాకు చెందిన ఓ మహిళతో పాటు ఇద్దరు నైజీరియన్లను అరెస్టు చేశారు. ఈ వివరాలను సీఐడీ అదనపు డీజీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు గురువారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఒసాజీ మైక్ ఒడియోన్, ఓసాయ్ జార్జ్ ఒడేగూ, ఉగాండాకు చెందిన రోసీ అనే ముగ్గురూ బిజినెస్ వీసాపై భారత్‌కు వచ్చి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ద్వారకలో స్థిరపడ్డారు. ఈ ముగ్గురూ ఓ ముఠాగా ఏర్పడి దేశ వ్యాప్తంగా అనేక మందికి లాటరీలు, బహుమానాలు వచ్చాయంటూ ఎస్‌ఎంఎస్‌లు పంపడం ప్రారంభించారు.



ఈ క్రమంలో మహారాష్ట్రలోని లాతూర్‌లో ఉన్న లైఫ్ కేర్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్న గుంటూరుకు చెందిన సీహెచ్ అంజమ్మకు ఇటీవల ఒసాజీ నుంచి లాటరీ తగిలిందంటూ ఓ ఎస్‌ఎంఎస్ వచ్చింది. దానికి అంజమ్మ స్పందించడంతో ఓసాయ్, రోసీ రంగంలోకి దిగి కథ నడిపించారు. వివిధ రకాల పన్నుల పేరు చెప్పి ఆమె వద్ద నుంచి మొత్తం రూ.4,53,950 దండుకున్నారు. చివరకు మోసపోయానని గుర్తించిన అంజమ్మ గత నెల 28న సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్పీ కాంతి రాణా టాటా నేతృత్వంలోని బృందం ఢిల్లీకి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుంది. న్యాయస్థానం అనుమతితో గురువారం హైదరాబాద్ తీసుకువచ్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top