ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌లో అంకెల్నే మార్చాం: బాబు

ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌లో అంకెల్నే మార్చాం: బాబు - Sakshi


హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్  అంకెల్నే అటూఇటుగా మార్చి కొన్ని మార్పులతో ప్రస్తుత బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. రానున్న ఏడు నెలల కోసం చేసిన ఈ కేటాయింపులు తాత్కాలికమేనన్నారు. ఫలితాలను అనుసరించి మార్పులు చేస్తామన్నారు. భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి రూ. 15,800 కోట్ల లోటు ఉందని, దీన్ని కేంద్రం భరిస్తామందని తెలిపారు. బుధవారం అసెంబ్లీలోని తన చాంబర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ హయాంలో వ్యవస్థ భ్రష్టుపట్టింది. పరిపాలన నిర్వీర్యమైంది. అనేక ఇబ్బందులున్నాయి.



వాటిని సరిదిద్దాలంటే సమయం పడుతుంది. పదేళ్ల అస్తవ్యస్థ పాలనపై ఏడు, విభజన సమస్యలపై ఒక శ్వేతపత్రాన్ని ఇచ్చాం. గతంలో జీరో బేస్డ్ బడ్జెట్‌ను మేము పెట్టాం. ఈ ఏడాది రెండు నెలలు ఉమ్మడి రాష్ట్రంలోనే పాలన నడిచింది. ఇప్పుడు రెండు నెలలుగా రాష్ట్రానికి సొంత ఖాతా ద్వారా ఆదాయ వ్యయాలు సాగుతున్నాయి. ఏ శాఖ ద్వారా ఎంత ఆదాయం వస్తుందో అంచనా వేయాలి. ప్రణాళికేతర వ్యయూన్ని తగ్గించుకోవాల్సి ఉంది. క్రమేణా ప్రణాళిక వ్యయాన్ని పెంచుకోవాలి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయాలి. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణ మాఫీని అమలు చేయడానికి నిధులు సమీకరించుకోవాలి. అక్టోబర్ నుంచి పింఛన్ల పెంపు, 24 గంటలు విద్యుత్తుకు వివిధ గ్రిడ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పాం. రోడ్లు, పోర్టులు, కేంద్రం నుంచి వచ్చే వివిధ సంస్థల ఏర్పాటు ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. ఆదాయాన్ని పెంచుకుంటేనే మేమిచ్చిన హామీలు అమలు చేయగలుగుతాం. రాష్ట్ర భవిష్యత్తూ దానిమీదే ఆధారపడి ఉంది. హామీల అమలుకు అప్పులు తేవాలంటే ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు అడ్డంకిగా ఉన్నారుు. అందువల్ల వ్యయంలో ఎక్కడెక్కడ కట్ చేయాలో చేసి నిధులు సమకూర్చుకుంటాం.



ఇప్పటికే ఎర్రచందన ం, ఇసుక వేలం పాటల్లో మార్పులు చేశాం’’ అని చెప్పారు. ‘‘మేము వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తున్నాం. భూసార పరీక్షల నుంచి వ్యవసాయధార పరిశ్రమల ఏర్పాటు వరకు సమన్వయం చేస్తాం. తొలిసారి వ్యవసాయ బడ్జెట్ పెడుతున్నాం. గ్రామీణ ఆర్థిక పరిస్థితికి ఇది దోహదపడుతుంది. సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో చేపట్టి పూర్తిచేయాలి. పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధిని పెంచాలి’’ అని చెప్పారు. రాజధానికి నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.



బడ్జెట్ గురించి తెలుసుకుని మాట్లాడాలి



బడ్జెట్ కేటాయింపులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ.. బడ్జెట్ అంటే ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు. తెలుసుకొని, అవగాహన చేసుకొని మాట్లాడాలని అన్నారు. తొమ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా, 30 ఏళ్ల రాజకీయానుభవంతో బడ్జెట్‌ను పెట్టామన్నారు. ఆయన తొలిసారి శాసన సభకు వచ్చారని అన్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top