‘మీకోసం’ కొత్త అవతారం

‘మీకోసం’


ప్రజావాణి ఇక ‘మీ కోసం’

పేరుమారుతున్నా  ప్రయోజనం దక్కేనా

పేరుకుపోతున్న అర్జీలు పట్టించుకునే వారు లేరు..

 


విశాఖపట్నం: తీరు మారదు.. కానీ తరచూ పేరు మారుతుంది. వేలల్లో కాదు..లక్షల్లో పేరుకుపోతున్న అర్జీలను పట్టించుకునే నాథుడు కన్పించరు. సంవత్సరాల తరబడి తిరుగుతున్నా పరిష్కారానికి నోచుకోని సమస్యలతో సామాన్య, నిరుపేదలు అల్లాడుతూనే ఉన్నారు. మొక్కుబడిగా సాగుతున్న గ్రీవెన్స్‌సెల్ వచ్చే వారం నుంచి ‘మీ కోసం’గా పేరు మార్చుకోబోతుంది. రెండు నెలలు కూడా కాలేదు  ప్రజాదర్బార్‌ను ప్రజావాణిగా మార్చి. ఇప్పుడు ‘మీ కోసం’ అంటూ ‘గ్రీవెన్స్ సెల్ ’ కొత్తఅవతారమెత్తుతోంది. 2009లో శ్రీకారం చుట్టిన గ్రీవెన్స్‌సెల్ ప్రతీ సోమవారం డివిజన్ స్థాయిలో ఆర్డీఒ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మండల స్థాయి పలుమార్లు తిరిగినా పరిష్కారానికి నోచు కోని సమస్యలను డివిజనల్ స్థాయిలో జరిగే గ్రీవెన్స్‌లో ఇస్తారు. అప్పటికీ పరిష్కారానికి నోచుకోని సమస్యలను నేరుగా కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్‌సెల్‌లో అంద జేస్తుంటారు.  కలెక్టర్ లేదా జేసీ వారిద్దరూ లేకపోతే డీఆర్‌ఒ ఎవరో ఒకరూ వీటిని పరిశీలించి సంబంధిత జిల్లా అధికారులకు ఎండార్స్ చేస్తుంటారు. జిల్లా అధికారులు మళ్లీ మండల స్థాయి అధికారులకు పంపిస్తుంటారు. కొన్ని సమస్యలనైతే నేరుగా మండలాలకే ఎండార్స్ చేస్తూ అర్జీదారులను అక్కడకే వెళ్లి మండల స్థాయి అకారులను కలుసుకోమంటూ హితవు పలుకుతుంటారు. ఇలా అర్జీలు ఎక్కడ నుంచి వస్తాయో అక్కడకే చేరుతుంటాయి. అయినా పరిష్కారానికి నోచుకోవు.  ఆన్‌లైన్‌లో మాత్రం పరిష్కార మైనట్టుగా కన్పిస్తుంటాయి. ఇదీ ఇప్పటి వరకు గ్రీవె న్స్‌ఉరఫ్ ప్రజావాణితీరు.

 

పరిష్కారమయ్యేవి 70 శాతం లోపే



కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌కు వచ్చే అర్జీల్లో 70శాతం వరకు పరిష్కారానికి నోచుకుంటున్నా, డివిజన్ స్థాయిలో 50 శాతానికి మించడం లేదంటున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో వీటిని పరిష్కరించాల్సిన మండల, గ్రామ స్థాయి అధికారుల వైఖరే కారణమని చెబుతున్నారు. గడిచిన ఐదేళ్లలో కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌కు 55,410 అర్జీలు రాగా, 45,258 పరిష్కారమైనట్టుగా చెబుతున్నారు. మరో 9,348అర్జీలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో నిర్ణీత గడువు ముగిసినా పరిష్కారానికి నోచుకోని అర్జీలు మరో 8412 వరకు ఉన్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలుండవు. డివిజన్ స్థాయిలో వినతుల సంఖ్య లక్షకుపైగానే ఉంటాయంటున్నారు. వీటిలో పరిష్కారమైనవి 50 శాతమే. ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం మావి కావంటే మావి కావంటూ సరిహద్దు తగాదాల్లో బుట్టదాఖలు చేసేవే ఎక్కువగా ఉంటున్నాయి.



జన్మభూమి ఫిర్యాదులకు దిక్కులేదు



రెండు నెలల క్రితం నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులెన్నో తెలుసా అక్షరాలా 2,64,829 వచ్చాయి. వీటిలో గ్రామీణప్రాంతాల్లో 1,93,863 రాగా, పట్టణ ప్రాంతాల్లో 70,966 ఉన్నాయి. అత్యధికంగా ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం 76,545, రేషన్ కార్డుల కోసం 64,645, పింఛన్ల కోసం 45,974, రెవెన్యూ సంబంధిత సమస్యలపై 30,168 పిటీషన్లు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు ఏ ఒక్క పిటీషన్‌ను పరిష్కరించిన పాపాన పోలేదు.

 

మండల స్థాయిలోనూ ‘మీ కోసం’



గ్రీవెన్స్‌సెల్ వచ్చేవారం నుంచి ‘మీ కోసం’గా రూపాంతరం చెందుతోంది. ఇప్పటి వరకు డివిజనల్, జిల్లా స్థాయిల్లో జరిగే ఈ గ్రీవెన్స్‌ను ఇక నుంచి శాఖల వారీగానే కాకుండా మండల స్థాయిలో కూడా నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు. ఫిబ్రవరి రెండవవారం నుంచి అధికారికంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top