క్యాష్ బ్యాక్!


391 పాఠశాలలకు విడుదల కాని నిధులు

కనీస అవసరాలకు డబ్బుల్లేవు

గత ఏడాది ఖర్చుచేయకుంటే

వెనక్కి ఇవ్వాలని ఆదేశం

జిల్లా విద్యా శాఖలో   వింత పరిస్థితి


 

మచిలీపట్నం : ‘కార్పొరేట్ చదువులకు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ సౌకర్యాలు కల్పిస్తాం.. విద్యాప్రమాణాలు పెంచి పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతాం..’ ఇవీ పాలకులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు తరచూ చెప్పే మాటలు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. విద్యాప్రమాణాల పెంపునకు, కనీస సౌకర్యాల కల్పనకు కావాల్సిన డబ్బుల్లేవు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) ద్వారా ఒక్కో ఉన్నత పాఠశాలకు ఏడాదికి రూ.50 వేల నిధులు విడుదల చేయాలి. పాఠశాలలు ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. నిధులు ఇవ్వడం పోయి.. గత ఏడాది విడుదల చేసిన మొత్తాల్లో ఏమైనా మిగిలితే వెనక్కి ఇచ్చేయాలని విద్యాశాఖాధికారులు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు లేఖలు రాయడం గమనార్హం. ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంది.


వాడని నిధులు వెనక్కివ్వండి..

జిల్లాలో జెడ్పీ ఉన్నత పాఠశాలలు 318, ప్రభుత్వ పాఠశాలలు 11, మున్సిపల్ పాఠశాలలు 41, గురుకుల పాఠశాలలు ఆరు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 14, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక్కో పాఠశాలకు ఏడాదికి రూ.50 వేలు చొప్పున రూ.1.95 కోట్లు విడుదల కావాల్సి ఉంది. 2014-15 విద్యాసంవత్సరంలో ఒక్కో పాఠశాలకు రూ.45 వేలు మాత్రమే ఇచ్చి మిగిలిన రూ.5 వేలు ఇవ్వకుండా నిలిపివేశారు. ఈ నిధులు ఖర్చుచేయకపోతే వెనక్కి పంపాలని ఇటీవల జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

 

మైనర్ రిపేర్లకు రూ.25 వేలు

 ప్రభుత్వ పాఠశాలల్లో మైనర్ రిపేర్ల కోసం ఏటా ఒక్కో పాఠశాలకు రూ.25వేలు విడుదల చేయాల్సి ఉంది. ఈ ఏడాది ఈ నిధులను విడుదల చేయలేదు. ఈ నగదుతో పాఠశాల భవనాలకు రంగులు వేయించడం, మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించడం, ఆటస్థలాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి. ఈ నిధులు విడుదల చేయకపోవడంతో సమస్యలు తిష్ట వేశాయి. కంప్యూటర్లు మరమ్మతులకు గురైనా కనీస మరమ్మతులు చేయించలేని పరిస్థితి నెలకొంది. నిధులు విడుదల కాకపోవ డంతో కనీస వసతులు కల్పించలేకపోతున్నామని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.

 

 నిధులు ఇలా ఖర్చు చేయాలి

 ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా ఒక్కో పాఠశాలకు రూ.50వేలు విడుదల చేస్తే అందులో రూ.25 వేలను ప్రయోగశాలల మరమ్మతులు, పరికరాల కొనుగోలు, మరమ్మతులు, రసాయనాల కొనుగోలు, ఇతరత్రా అవసరాలకు వినియోగించాలి. రూ.10 వేలతో రిఫరెన్స్ పుస్తకాలు, వార్తాపత్రికలు, లైబ్రరీకి అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేయాల్సి ఉంది. పాఠశాలల్లో మంచినీటి సరఫరా, విద్యుత్, టెలిఫోన్, ఇంటర్‌నెట్, ఇతరత్రా బిల్లుల చెల్లింపుల కోసం మరో రూ.15 వేలు వినియోగించుకోవాల్సి ఉంది. విద్యాశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కొన్ని పాఠశాలల్లో ఈ నిధులను ఖర్చు చేయకుండా అలానే ఉంచిన ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. కళ్లెదుటే సమస్యలు కనపడుతున్నా వాటిని పరిష్కరించకుండా, నిధులు ఖర్చుచేయని పరిస్థితి ఉంది.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top