తిరుగుబాటు కాదు... పోలీసుల పనే


  • కోరుకొండ ఘటనపై  మావోయిస్టుల వివరణ

  •  గాలికొండ, కోరుకొండ ఏరియా కమిటీల పేరుతో లేఖలు

  •  తగిన మూల్యం తప్పదని హెచ్చరిక

  • పాడేరు/పెదబయలు: చింతపల్లి మండలం బలపం పంచాయతీ కోరుకొండలో మావోయిస్టుల హత్య ప్రజల తిరుగుబాటు కాదని, ఎస్‌ఐబీ పోలీసులు, మతం ముసుగులోని ఓ వర్గం భక్తుల పనని మావోయిస్టులు వివరణ ఇచ్చారు. ఈనెల 20న వీరవరం లో జరిగిన ఘటనపై ప్రజా తిరుగుబాటుగా పోలీ సులు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని, ప్రజా బలంతోనే వారి దుష్ర్పచారాన్ని ఎదుర్కొంటామన్నారు. విప్లవకారుల సమాచారాన్ని సేకరించి వారిని అంతమొందించేందుకు ఎస్బీఎక్స్ అనుసరిస్తున్న మార్గా ల్లో ఇదొకటని స్పష్టం చేశారు.



    సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ, కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి విజయలక్ష్మి పేరున పాడేరు, పెదబయలు విలేకరులకు గురువారం వేర్వేరుగా ప్రకటనలందాయి. వీటి సారాంశం ఇది. ‘మతాన్ని అడ్డం పెట్టుకుని గుదలంవీధి గురువు సింహాచలం, ఇటీవల ప్రజాకోర్టులో హతమైన సంజీవరావులు ఉద్యమద్రోహులుగా మారారు. గత కొన్నేళ్లుగా వీరవరం సంజీవరావు మతం ముసుగులో గుదలంవీధి, చింతపల్లి, గూడెం ప్రాంతాల్లో ప్రచారం పేరుతో తిరుగుతూ అక్రమంగా కలప తరలిస్తుండేవాడు.  



    కాఫీ పోరాటానికి మొదటి నుంచి వ్యతిరేకంగా ఉంటూ వీరవరం, తూరుమామిడి, కుడుముల, గిడువలసపల్లి గ్రామాల్లో మతం ముసుగులో ప్రజల్లో చీలిక తెచ్చాడు. అప్పట్లో ఎస్‌ఐబీ అధికారి వెంకటరావు, ఓఎస్‌డీ దామోదర్‌కు సన్నిహితంగా ఉంటూ కాఫీ ఉద్యమాన్ని నీరుగార్చడం, పీఎల్‌జీఏ, మన్యం పితూరిసేన సభ్యుల్ని అక్రమంగా అరెస్టు చేయిం చడం చేసేవాడు. వీటిపై సంజీవరావును పలుమార్లు హెచ్చరించాం. అతను ప్రజావ్యతిరేకిగా మారాడని ప్రజాకోర్టులో ప్రజలు ముక్తకంఠంతో మరణ శిక్షణ వేయాలని కోరడంతోనే హతమార్చాం.



    సంజీవరావును హత్యచేసిన తర్వాత గుదలంవీధి గురువు సిం హాచలంను హెచ్చరించి వదిలేయాలని కోరుకొండ సంతకు తీసుకువచ్చాం. అయితే ఎస్‌ఐబీ పోలీసుల ముందస్తు ప్రణాళికలో భాగంగా మతం ముసుగులో తిరుగుతున్న కొందరు గూండాలు అక్కడి ప్రజల్ని ఉసిగొలిపారు. నరకండి, చంపండి అంటూ గుదలం వీధి గురువు హెచ్చరించడంతో మావోయిస్టులు ప్రజల చేతుల్లో హతమయ్యారు.  ప్రజలు చావగొడుతున్నా వారికి హానిజరగ కూడదన్న తలంపుతోనే మావోయిస్టు నేతలు కామ్రేడ్ శరత్, కామ్రేడ్ గణపతులు తమ ఆయుధాలు ఉపయోగించకుండా, ప్రతిఘటించకుండా అమరులయ్యారు. వారికి విప్లవ వందనాలు తెలియజేస్తున్నాం.



    ఈ ఘటన మొత్తానికి గుదలంవీధి గురువు సింహాచలం ప్రధాన కారకుడు. ఇందుకు అతను తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. వీరవరం సన్యాసిరావు, పాంగిమాను అలియాస్ టంటడు, వీరవరం సంజీవరావు అన్న భాస్కరరావు, తమ్ముడు మహేష్, వలసపల్లి హోంగార్డు సునీత అన్న వెంకటరావు, తూరుమామిడి కామేష్, సత్తిబాబులంతా మతం ముసుగులో గ్రామాల్లో తిరుగుతూ ఉద్యమకారుల వివరాలు సేకరిస్తూ పోలీసులకు చేరవేస్తున్నారు.



    వీరందరికీ సంజీవరావు నాయకత్వం వహిస్తుండడంతో అతన్ని ప్రజాకోర్టులో హత్య చేశాం. ఇప్పుడు గుదలంవీధి గురువు తగిన మూల్యం చెల్లించుకుంటారు.’ అంటూ మావోయిస్టులు తమ లేఖల్లో పేర్కొన్నారు. మన్యంలో మావోయిస్టుల ప్రాబల్యం లేదని డీఐజీ, ఎస్పీ ప్రకటనలు చేస్తూనే కూంబింగ్ విస్తృతం చేయడంలోని అర్థం ఏమిటని కోరుకొండ  కమిటీ కార్యదర్శి విజయలక్ష్మి ప్రశ్నించారు. మన్యంలోగాని, ఇతర ప్రాంతాల్లోగాని మావోయిస్టులు లేకుండా చేయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు.

     

    30న మావోయిస్టుల బంద్




    సీలేరు: కోరుకొండలో శరత్, గణపతుల హత్యకు నిరసనగా ఈనెల 30న జిల్లా బంద్ పాటిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం ఒక ప్రకటనలో తెలిపారు. కోరుకొండ ఘటనలో రాజప్రయోజిత గూండాలు చేసిన హత్యల వల్లే కామ్రేడ్ శరత్, గణపతులు అమరులయ్యారని పేర్కొన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top