ఐసీయూకీ గతిలేదు


రాజధాని పెద్దాస్పత్రిలో రోగుల పాట్లు

మేజర్ ఆపరేషన్ చేసినా..  వార్డులోనే రోగులు

ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం వైద్యుల్లోనూ ఆందోళన

మరమ్మతుల్లో  పోస్టు ఆపరేటివ్ వార్డు

 


లబ్బీపేట :   ఉయ్యూరుకు చెందిన సరస్వతికి కడుపు నొప్పి రావడంతో చికిత్స కోసం పెద్దాస్పత్రికి వచ్చింది. ఆమెకు పరీక్షలు జరిపిన వైద్యులు పేగుల్లో పుండు ఉన్నట్లు గుర్తించి నాలుగున్నర గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స చేశారు. ఇలాంటి కేసుల్లో రోగులను శస్త్రచికిత్స అనంతరం మూడు నాలుగు రోజులు ఐసీయూలో ఉంచాలి. కానీ ఇక్కడ ఆ సదుపాయం లేకపోవడంతో సాధారణ వార్డులోనే ఉంచారు.



సింగ్‌నగర్‌కు చెందిన అప్పాయమ్మ అనారోగ్యంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. హెర్నియాతో అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు క్లిష్టతరమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సర్జరీ అనంతరం ఆమెను ఉంచేందుకుపోస్టు ఆపరేటివ్ వార్డు అందుబాటులో లేక, జనరల్ వార్డులోనే ఉంచారు. ఇలా క్లిష్టతరమైన శస్త్రచికిత్సలు చేయించుకున్న మరెందరినో ఐసీయూ, పోస్టు ఆపరేటివ్ వార్డులు అందుబాటులో లేకపోవడంతో సాధారణ వార్డుల్లోనే ఉంచాల్సిన దుస్థితి నెలకొంటోంది.

 

ఇన్‌ఫెక్షన్లు సోకితే ఎవరు బాధ్యులు?


శస్త్రచికిత్స తర్వాత రోగికి ఇన్‌ఫెక్షన్ సోకకుండా బయటి నుంచి గాలి కూడా సోకని, ఐసీయూ, పోస్టు ఆపరేటివ్ వార్డుల్లో ఉంచాలి. కానీ ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సాధారణ వార్డులో, అందులోను నిబంధనలకు విరుద్ధంగా కిక్కిరిసి వేసిన పడకల మధ్యనే శస్త్ర చికిత్స చేసినవారిని ఉంచుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని కూడా అక్కడే ఉంచాల్సి వస్తుండటంతో ఎప్పుడేమి జరుగుతుందోనని వైద్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఒకవేళ వారికి ఇన్ ఫెక్షన్లు సోకి జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కష్టపడి శస్త్రచికిత్సలు చేస్తున్నా, రోగులను ఉంచేందుకు సరైన వార్డులు లేవని ఓ సీనియర్ వైద్యుడు తెలిపారు.



అలంకారప్రాయంగా ఎస్‌ఐసీయూ...

ఆపరేషన్ తర్వాత క్రిటికల్ కేసులను ఉంచేందుకు ఆస్పత్రిలో ఎస్‌ఐసీయూ ఉన్నా అది నిరుపయోగంగా మారింది. ఇక్కడ కూడా ఏసీలు పనిచేయక పోవడంతో తలుపులన్నీ తీయాల్సిన దుస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితిలో అక్కడ రోగిని ఉంచినా ఎటువంటి ప్రయోజనం ఉండదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం న్యూరో సర్జరీ కేసులను మాత్రమే అక్కడ ఉంచుతున్నారు. అంతేగాక ఆరోగ్యశ్రీ వార్డుగా కూడా దానినే చూపిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top