ఆ బీమా సొమ్మూ బ్యాంకులకే..!


అంతవరకు 20% రుణమాఫీ కూడా లేదు

రూ. 300 కోట్ల పంటల బీమా సొమ్ము కోసం సర్కారు ఎదురుచూపులు

ఇప్పటికే రూ.338 కోట్లు రైతుల రుణ బకాయిల కింద జమేసుకున్న బ్యాంకులు

 


హైదరాబాద్: రైతుల రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా సొమ్ముతో ముడిపెడుతోంది. కేంద్రం నుంచి వచ్చే బీమా మొత్తం కోసం ఎదురుచూస్తూ చివరకు 20 శాతం రుణమాఫీ విషయంలోనూ జాప్యం చేస్తోంది. చంద్రబాబునాయుడు ఇచ్చిన రుణమాఫీ హామీతో రైతులు తాము తీసుకున్న రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించలేదు. ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయకపోవడంతో.. ఇప్పటివరకు రెండు దశల్లో వచ్చిన పంటల బీమా సొమ్మును రైతుల రుణ బకాయిల కింద బ్యాంకులు జమ చేసుకున్నాయి. త్వరలో మరో రూ.300 కోట్ల పంటల బీమా సొమ్ము కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని కూడా రైతుల రుణ బకాయిల కింద బ్యాంకులు జమ చేసుకున్న తర్వాతనే 20 శాతం రుణ మాఫీ అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవలి కాలంలో 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంటల బీమా సొమ్ము రూ.68 కోట్లు వచ్చింది. ఆ సొమ్మును రైతులకివ్వకుండా  రుణ బకాయిల కింద బ్యాంకులు జమ చేసుకున్నాయి.



అలాగే  2013-14 ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ పంటల బీమా సొమ్ము కింద తొలి విడతగా రూ.270 కోట్లను కేంద్రం ఇటీవల విడుదల చేసింది. ఆ సొమ్మునూ బ్యాంకులు జమ చేసుకున్నాయి. కాగా రెండో దశ కింద ఈ ఖరీఫ్‌కు చెందిన మరో రూ.300 కోట్లను కేంద్రం  విడుదల చేయాల్సి ఉంది. అది విడుదలైతే ఆ మొత్తాన్ని కూడా బ్యాంకులు రైతుల రుణ బకాయిల కింద జమ చేసుకున్న తరువాతనే 20 శాతం రుణ మాఫీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 20 శాతం రుణ మాఫీలో సుమారు ఏడు లక్షల నుంచి పది లక్షల మంది రైతుల రుణాలు పూర్తిగా తీరిపోతాయని, ఆ తర్వాత బీమా సొమ్ము వస్తే రైతులకే దక్కుతుంది కాబట్టి.. బీమా సొమ్ము వచ్చిన తరువాతనే 20 శాతం మాఫీ చేయాలనే ఎత్తుగడ ప్రభుత్వం వేసిందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో.. 20 శాతం రుణ మాఫీ కూడా చేయకుండా జాప్యం చేస్తే త్వరలో వచ్చే రూ.300 కోట్లను బ్యాంకులు జమ చేసుకుంటాయని, ఆ మేరకు ప్రభుత్వంపై భారం తగ్గుతుందని సర్కారు భావిస్తున్నట్టుగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. అందువల్లే అన్ని వివరాలు ఉండి మాఫీకి అర్హులైన రైతుల ఖాతాలు 40 లక్షలని తేలినప్పటికీ.. కనీసం ఆ జాబితాలను కూడా బహిర్గతం చేయకుండా పంటల బీమా సొమ్ము వచ్చిన తర్వాత వెల్లడించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని సమయంలో అర్హులైన జాబితాలను ప్రకటిస్తే అర్హులు కాని రైతులు నిరసన వ్యక్తం చేస్తారని, అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతాయని ప్రభుత్వం భావించింది. ఈ కారణంగా కూడా సీఎం జపాన్ పర్యటన ముగించుకుని వచ్చేవరకు రైతుల జాబితాలను బహిరంగ పరచరాదనే నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా  జాబితాలను బ్యాంకు బ్రాంచీలకు పంపించి ఒకసారి సరిచూసి పంపాల్సిందిగా కోరాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇలా సీఎం వచ్చే వరకు కథ నడపాలని యత్నిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top