కదులుతున్న అవినీతి డొంక


నగరంలో  అక్రమ నిర్మాణాల జోరు

పాత ఫైళ్లను తిరగదోడుతున్న

కమిషనర్  అధికారుల బెంబేలు

టౌన్ ప్లానింగ్‌లో    {బోకర్ల రాజ్యం


 

విజయవాడ సెంట్రల్ :  టౌన్ ప్లానింగ్‌లో అవినీతి డొంక కదులుతోంది. అక్రమ కట్టడాలకు సంబంధించి పాత ఫైళ్లను కమిషనర్ జి.వీరపాండియన్ తిరగ తోడుతున్నారు. అక్రమ నిర్మాణాలే లేవంటూ నివేదిక ఇచ్చిన అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. నాలుగు నెలలుగా నగరంలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. ఒక్కో బిల్డింగ్‌కు మూడు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారంటే బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కొందరు అధికారులు, కార్పొరేటర్లు కుమ్మక్కై దందా సాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



చెప్పింది చేయండి..

సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు అధికార పార్టీ కార్పొరేటర్లు అక్రమ నిర్మాణాలను బిజినెస్‌గా మలుచుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ కార్పొరేటర్  ఏడాది కాలంలో 52 అనధికారిక కట్టడాలను ప్రోత్సహించినట్లు సమాచారం. ఓ మహిళా కార్పొరేటర్ భర్త తరచు టౌన్‌ప్లానింగ్‌లో హల్‌చల్ చేయడం వివాదాస్పదంగా మారింది. తమ వాళ్లు చెప్పింది చేయాల్సిందేనంటూ టీడీపీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో దరఖాస్తుదారుల కంటే బ్రోకర్లే ఎక్కువ కనిపిస్తుంటారు. దీన్ని నియంత్రించడంలో ఉన్నతాధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు.

 

పంపకాల లొల్లి


 మామూళ్ల వ్యవహారంలో అధికారులు, కార్పొరేటర్ల మధ్య విభేదాలు తలెత్తడంతోనే అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.  పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత కమర్షియల్ ప్రాంతంలోని కార్పొరేటర్ ఒక్కో బిల్డింగ్ నుంచి రూ.5 లక్షలు వసూలు చేస్తూ అధికారుల చేతిలో రూ.50 వేలు పెడుతున్నట్లు సమాచారం. అదే అధికారులు అనుమతిచ్చే అక్రమ కట్టడాల్లో తనకు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ అదే కార్పొరేటర్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.  ఈ విషయమై కార్పొరేటర్, అధికారి మధ్య  వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. సెంట్రల్ నియోజకవర్గంలోని ఓ మహిళా కార్పొరేటర్ భర్త వైఖరిపై విసుగెత్తిన అధికారి ‘నువ్వు కార్పొరేటర్‌వి కాదు. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు..’ అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనధికారిక కట్టడాలను ఆ కార్పొరేటర్ భర్త వ్యాపారంగా మార్చుకోవడమే ఇందుకు కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. టౌన్‌ప్లానింగ్ అధికారులపై తరచు ఆగ్రహం వ్యక్తం చేసే మేయర్ కోనేరు శ్రీధర్ తమ పార్టీ కార్పొరేటర్లను కంట్రోల్ చేసుకోవడంలో విఫలమవుతున్నారు.

 

 ఏసీబీ కన్ను


 నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ విభాగంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు డేగకన్ను వేశారు. నెలన్నర రోజుల్లో రెండు దఫాలుగా విచారణ చేపట్టారు. గతంలో నిర్మాణమైన రెండు అక్రమ కట్టడాలకు సంబంధించి స్పష్టమైన ఫిర్యాదులు అందడంతో కూపీ లాగారు. కొందరు చైన్‌మెన్లు రెచ్చిపోతున్నారని ఫిర్యాదులు అందటంతో సర్వీస్ రిజిస్టర్ల నుంచి వారి వివరాలు సేకరించారు. రెండేళ్ల కిందట బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ చీకటి సత్యనారాయణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈజీ మనీకి అలవాటుపడిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ స్కాంవెండీష్ స్థాయికి మించి అప్పులు చేసి ఏడాది క్రితం ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. గతం నేర్పిన గుణపాఠాల నుంచి ఏమాత్రం అనుభవం నేర్వని కొందరు అధికారులు, సిబ్బంది యథేచ్ఛగా అక్రమాలకు తెగబడుతున్నారు. సరైన చర్యలు లేకపోవడం వల్లే టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి పేట్రేగిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top