ఆగని దాడులు


సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఎన్నికలు జరిగి మూడు నెలలు దాటినా ఇంకా అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు ఆగడంలేదు. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని లక్ష్యంగా పెట్టుకొని దాడులకు దిగుతూనే ఉన్నారు. తాజాగా పర్చూరు మండలంలోని ఇనగల్లు గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టి.డి.పి. కార్యకర్తలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.



 తన్నీరు తిరుపతిరావు, కొప్పోకు వెంకటేష్ , చిట్టినేని రామకృష్ణ పొలం వెళ్ళి వస్తుండగా తెలుగుదేశంకి చెందిన పోపూరి శ్రీను, రాము మరికొంతమందితో కలిసి కర్రలు, రాడ్‌లతో  వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన వీరిని ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లాలో ఎన్నికల తర్వాత జరిగిన అధికార పక్షం చేసిన దాడుల్లో ఇద్దరు, అధికార పక్షానికి కొమ్ము కాస్తూ పోలీసులు చేసిన దాడిలో ఒకరు మృతి చెందారు. మొత్తం 36 మంది గాయపడ్డారు. హత్యకు గురైన గోగాడి సింగయ్య, తేలుకుంట్ల వెంకయ్య కుటుంబ సభ్యులను .తెలుగుదేశం నేతలు బెదిరిస్తున్నారు. కేసు వాపసు తీసుకోకపోతే మీకూ ఇదే పరిస్థితి తప్పదని వారు బెదిరింపులకు దిగుతున్నారు.



 గతంలో జరిగిన దాడుల వివరాలు...

యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలంలోని మర్రివేములలో మే 16న టీడీపీ వర్గీయులు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో వైయస్‌ఆర్ సీపీకి చెందిన ఎం.చిన్న అంజయ్య, ఎం. పెద్ద అంజయ్య, ఎం. బాల అంజయ్యలతోపాటు వెంకటరమణమ్మ అనే గర్భణికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరు దాదాపు వారం రోజులపాటు గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందారు.



అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు మండలం తంగేడుమల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు ధూళిపాళ్ల హరికృష్ణను టీడీపీకి చెందిన మర్ల పాటి శేషయ్య అనే వ్యక్తి గొడ్డలితో దాడి దాడిచేశారు. మరో ఘటన సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ నాయకులు గుండపనేని మోహనరావుపై టీడీపీకి చెందిన కొల్లూరి శ్రీనివాసరావు పొలం వద్ద కత్తితో దాడిచేశారు.



బేస్తవారిపేట మండలం ఖాజీపురంలో టీడీపీ వర్గీయులు చేసిన రాళ్ల దాడిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి.     



ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల ఇరువర్గాల మధ్యదాడి జరగ్గా అందులో వైఎస్సార్‌సీపికి చెందిన అయిదుగురు, టీడీపీకి చెందిన ముగ్గురు గాయపడ్డారు.



యద్దనపూడి మండలంలోని సీతారాముల ప్రతిష్ట ఆనంతరం 41వ రోజున అన్నదానం కార్యక్రమానికి మంచినీటి ట్యాంకరు తీసుకొని వెళ్ళిన సర్పంచి కుమారునిపై ఉప సర్పంచి మరికొంతమంది దాడిచేశారు. విషయం తెలుసుకొని అక్కడకు వెళ్ళిన సర్పంచి ఏసమ్మపై కూడా దాడిచేసి ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించారు.



మర్రిపూడి మండలంలోని తంగెళ్ళ పంచాయతీలోని అయ్యారిపాలెం గ్రామంలో టిడిపి కార్యకర్తలు వైయస్సార్‌సి.పి. కార్యకర్తల మీద దాడులు చేయగా నలుగురు గాయపడ్డారు. టంగుటూరు మండలంలోని పొందూరు గ్రామంలో టి.డి.పి. కార్యకర్తల దాడిలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలను గాయపరచి  వైసీపీ కార్యకర్తకు చెందిన కొట్టాన్ని తగులబెట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top