‘ప్రకాశించని’ బడ్జెట్


 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాపై శీతకన్ను వేశారు. ఒక్క ప్రాజెక్టు కూడా  జిల్లాకు కేటాయించలేదు. రామాయపట్నం పోర్టును సాధిస్తానని జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు బడ్జెట్ సమావేశాల ముందు విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. కానీ ఆచరణలో ఈ పోర్టు ప్రస్తావనే బడ్జెట్‌లో చోటు చేసుకోలేదు.



ఒంగోలులో నాన్ - మెట్రో విమానాశ్రయం నిర్మాణం చేపడతామని ప్రకటించినా నిధులు మాత్రం కేటాయించలేదు.  జిల్లాకు శిల్పారామం మంజూరైందని ఇక్కడి నేతలు చెబుతూ వచ్చారు. అయితే బడ్జెట్‌లో కేటాయించిన శిల్పారామాల్లో ఒంగోలుకు స్థానం దక్కలేదు. రిమ్స్‌లో హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకాకుళం, ఒంగోలు కలిపి రూ.3.31 కోట్లు, మెడికల్ కాలేజీ కోసం రూ.8.99 కోట్లు కేటాయించారు. జిల్లా పరిశ్రమల అభివృద్ధి శాఖ భవనానికి నిధులు మంజూర య్యాయి.



 ‘కోత’ల యజ్ఞం:

 జలయజ్ఞం ప్రాజెక్టులకు భారీగా కోత పెట్టారు. దీంతో జిల్లాలో జలయజ్ఞ ఫలాలు ఇప్పట్లో ప్రజలకు అందే సూచనలు కనిపించడం లేదు. ప్రధానమైన ప్రాజెక్టుల్లో పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఒకటి. ఈ ప్రాజెక్ట్‌ను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.



 ఎనిమిదేళ్లలో పూర్తికావాలని నిర్ణయిస్తే పదేళ్ల కాలంలో ఇప్పటికి సగంపని మాత్రమే పూర్తయింది. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పకుండా ఎప్పటికప్పుడు గడువు పెంచుకుంటూ పోతున్నారు. కీలకమైన వెలిగొండ ప్రాజెక్టుకు కేవలం రూ.76.58 కోట్లు కేటాయించారు. గత ఏడాది రూ.402 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది దాన్ని పూర్తిగా తగ్గించారు.





ఇక గుండ్లకమ్మ ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా కాలువల నిర్మాణాల్లో లోపాలు,కొన్ని చోట్ల పూర్తికాకపోవడం, ఈ విషయాల్లో పాలకులకు చిత్తశుద్ధి లోపించడం రైతులకు శాపంగా మారింది.  80 వేల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టును వెనువెంటనే వినియోగంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. గుండ్లకమ్మకు రూ.100 కోట్లు కేటాయిస్తే నిర్వాసితుల సమస్యతోపాటు చిన్న చిన్న కాలువల నిర్మాణం పూర్తవుతుంది. అలాంటి దానికి గత ఏడాది రూ.17 కోట్లు కేటాయించగా ఈ ఏడాది  రూ. ఐదు కోట్లతో సరిపెట్టారు.



కొరిశపాడులోని పోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కావడానికి వంద కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా గత ఏడాది రూ.17 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.ఏడు కోట్లతో సరిపెట్టారు.  



పాలేరు రిజర్వాయర్‌కు రూ.రెండు కోట్లు, మున్నేరుపై నిర్మిస్తున్న రాళ్లపాడు స్టేజి-2కి రూ.రెండు కోట్లు, మోపాడు రిజర్వాయర్‌కు రూ.మూడు కోట్లు, రామతీర్థం రిజర్వాయర్‌కు రెండు లక్షల రూపాయలు కేటాయించారు. పాలేరు ప్రాజెక్టుకు కోటి రూపాయలు, కంభం చెరువు అభివృద్ధికి పది లక్షల రూపాయలు, పోతురాజు నాలా డ్రైన్ అభివృద్ధికి కోటి రూపాయలు బడ్జెట్‌లో చూపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top