నామినేషన్ల పరిశీలన పూర్తి


  •    అసెంబ్లీ సెగ్మెంట్లకు మొత్తం దాఖలైన నామినేషన్లు 280

  •      అంగీకరించినవి 225, తిరస్కరించినవి 55

  •      చెల్లనవి చిత్తూరు లోక్‌సభ 1, రాజంపేట పార్లమెంట్లో 2

  •  సాక్షి, చిత్తూరు: జిల్లాలో 16వ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ, లోక్‌సభ నామినేషన్ల పరిశీలన ఘట్టాన్ని రిటర్నింగ్ అధికారులు సోమవారం పూర్తి చేశారు. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 280 నామినేషన్లు రాగా, 55 నామినేషన్లను ఎన్నికల అధికారులు వివిధ సాంకేతిక కారణాలతో తిరస్కరించారు. తిరుపతి అసెంబ్లీలో అత్యధికంగా 18 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.



    గంగాధరనెల్లూరు, మదనపల్లె, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యల్పంగా ఒక్కో నామినేషన్ తిరస్కరించారు. రాజంపేట లోక్‌సభకు 12 నామినేషన్లకుగాను 2 తిరస్కరించారు. 10 నామినేషన్లను అంగీకరించారు. చిత్తూరు లోక్‌సభకు 10 నామినేషన్లు వస్తే ఒకటి తిరస్కరించారు. 9 నామినేషన్లను అంగీకరించారు. ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పరిశీలన కీలక ఘట్టం కావటంతో చాలా మంది అభ్యర్థులు నామినేషన్ పరిశీలన పూర్తయ్యేవరకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్దే ఉన్నా రు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23వ తేదీ చివరి గడువు.

     

    ఒక్కో సెట్టే పరిగణనలోకి....

     

    జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు ఒక్కొక్కరు ఐదు, ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో చిన్నచిన్న సాంకేతిక కారణాల రీత్యా కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండడంతో ఒక సెట్టు తిరస్కరించినా, రెండో సెట్టో, మూడవ సెట్టో చెల్లుతుందనే ఉద్దేశంతో ఇబ్బడిముబ్బడిగా  ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అధికారులు  అభ్యర్థుల ఇంటి పేరు దగ్గర నుంచి వారు సమర్పించిన ఆదాయ వ్యయవివరాల అఫిడవిట్లు వరకు అన్నింటిని  క్షుణ్నంగా పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతే వాటిని అంగీకరించారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top