నామినేషన్ల సందడి

నామినేషన్ల సందడి - Sakshi


 విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో నామినేషన్ల సందడి జోరందుకుంది. మంగళవారం విశాఖ లోక్‌సభకు 3, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 33 మొత్తంగా 36 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు రెండు నుంచి నాలుగు సెట్లు వేశారు.



విశాఖ లోక్‌సభకు బుద్ద చంద్రశేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా 2 సెట్లు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి  దాడి జ్యోతి భవాని ఒక సెట్ నామినేషన్ వేశారు. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థులు పాయకరావుపేటకు చెంగల వెంకట్రావు, విశాఖ-పశ్చిమకు దాడి రత్నాకర్‌లు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. భారీగా ర్యాలీలతో సందడి చేశారు. చెంగల వెంకటరావు నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వీఆర్‌ఎన్‌ఎల్ శర్మకు రెండు సెట్ల నామినేషన్‌లు అందజేశారు.

 

డమ్మీగా ఆయన సతీమణి చెంగల పుష్పకూడా రెండు సెట్లు వేశారు. అదే స్థానానికి చెవ్వేటి తలుపులు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ పశ్చిమానికి దాడి రత్నాకర్ జ్ఞానాపురం ప్రాంతంలోని జీవీఎంసీ జోన్-4 కార్యాలయంలో ఎన్నికల అధికారికి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అంతకు ముందు ర్యాలీగా వచ్చిన ఆయనకు జనం అడుగడుగునా హారతులు పట్టారు. ప్రతీ వీధిలోను ఆయతో కలిసి అడుగులు వేశారు. దీంతో రోడ్లన్నీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోయాయి.

 

ఇదే సెగ్మెంట్‌కు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి సేనం సాయి అరవింద్ నామినేషన్ వేశారు.  విశాఖ-ఉత్తరం నియోజకవర్గానికి లోక్‌సత్తా పార్టీ అభ్యర్థి భీశెట్టి అప్పారావు, స్వతంత్రులుగా సరిపల్లి దేముళ్లు, సింగంశెట్టి ప్రసాదరావు, అరకువేలీకి సీపీఎం అభ్యర్థి కిల్లో సురేంద్ర 3 సెట్లు, పెందుర్తికి జైసమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి మేడపు రెడ్డి నూతన్ కుమార్, యలమంచిలికి వీసం వెంకట సత్యనారాయణమూర్తి స్వతంత్ర అభ్యర్థిగా 4 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు.

   

 నర్సీపట్నంకు టీడీపీ అభ్యర్థి చింతకాల అయ్యన్నపాత్రుడు 2 సెట్లు, టీడీపీ డమ్మీ అభ్యర్థిగా చింతకాయల విజయ్ 2 సెట్లు, లోక్‌సత్తా అభ్యర్థి తవ్వ చిరంజీవిరావు 3 సెట్ల నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల హోరు బుధవారం నుంచి మరింత పెరగనుంది. ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ 16, 17 తేదీల్లోనే నామినేషన్లు వేయనున్నారు. భారీ ర్యాలీలతో బలప్రదర్శన చేయనున్నారు. ఈ పరిస్థితి దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద ప్రత్యేక బలగాలను మోహరిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top