‘పందేరపు’ ప్రక్రియకు ఊపు


సాక్షి, కాకినాడ :నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధికార తెలుగుదేశం పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెలాఖరులోగా వీటన్నింటిని భర్తీ చేయాలన్న అధిష్టానం ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా ముఖ్యనేతలంతా సమావేశం కానున్నారు. ఏ స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఎవరి పెత్తనం ఉండాలి, ఎవరెవరికి ప్రాతినిధ్యం ఉండాలి తదితర అంశాలపై చర్చించి తుదిజాబితాలను సిద్ధం చేయనున్నా రు. తర్వాత అధినాయకత్వం ఆమోదంతో పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.

 

 ఏదేమైనా ఈ పదవుల పందేరం పార్టీ  జిల్లా నేతల మధ్య ఆధిపత్య పోరుకు తెరతీయనుంది. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండడంతో టీడీపీ శ్రేణులు పదవుల కోసం ఆవురావురమంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ నామినేటెడ్ పోస్టులను దక్కించుకుందామన్న ఆతృతతో పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. అధికారంలోకి వందరోజుై లెనా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఇప్పటి వరకూ అమలు చేయకుండా ప్రజలకు అన్యాయం చేసిన అధినాయకత్వం కూడా కార్యకర్తలకు మాత్రం సత్వర  న్యాయం చే యాలని చురుకుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే గతం లో ఎన్నడూ లేని రీతిలో గత ప్రభుత్వం నామినేట్ చేసిన పదవులన్నీ రద్దు చేస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది.

 

 టీడీపీ అధికారంలోకి రావడంతో జిల్లాలో ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ పదవులపై కన్నేస్తే మరికొందరు రాష్ర్టస్థాయి కార్పొరేషన్ పదవులపై గురిపెట్టారు. ఇక ద్వితీయ, తృతీయశ్రేణి నాయకులైతే జిల్లాస్థాయి నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. వీటి భర్తీ విషయమై గురువారం కాకినాడ లో మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడుల మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. పోస్టుల భర్తీపై జిల్లాలో కసరత్తు జరిపి, అధినాయకత్వానికి నివేదిక సమర్పిస్తే అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు భర్తీ చేయవచ్చని రాజప్పకు యనమల సూచించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అమలాపురంలోని  రాజప్ప స్వగృహంలో జిల్లా ముఖ్యనేతలంతా భేటీ కాబోతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జిల్లా ముఖ్యనేతలందరికీ భేటీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందినట్టు తెలిసింది.

 

 ఆందోళనలో సీనియర్ నాయకులు

 గత పదేళ్లుగా పార్టీ కోసం పని చేసిన వారికి సీనియార్టీ ప్రాతిపదికన నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలే తప్ప కొత్తగా వచ్చిన వారికి ఇవ్వరాదని పలువురు సీనియర్లు ఇప్పటికే పార్టీ జిల్లా అగ్రనేతలకు  స్పష్టం చేశారు. తమ గెలుపు కోసం పనిచేసిన వారిని కాదని ఇటీవల పార్టీలోచేరిన వారిని వెంటేసుకు తిరుగుతున్న పలువురు ప్రజాప్రతినిధులపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. కొత్తగా వచ్చిన వారికి ఎక్కడ పదవులు కట్టబెడతారోననే ఆందోళన వారిని వె న్నాడుతోంది. ఇటీవల పార్టీలోకి వచ్చి జిల్లా కార్యాలయంలో హడావుడి చేస్తున్న కార్యకర్తలపై గురువారం ఇదే విషయమై సీనియర్లు మండిపడడమే కాక బాహాబాహీకి దిగడం పరిస్థితికి అద్దం పడుతోంది. మరోపక్క మిత్రపక్షమైన బీజేపీ నుంచి కూడా నామినేటెడ్ పదవుల్లో తమ శ్రేణులకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఒత్తిడి వస్తోంది.

 

 పదవుల స్థాయిని బట్టి భర్తీపై పెత్తనం

 నియోజకవర్గ స్థాయికి పరిమితమైన మార్కెట్ కమిటీలు, దేవాలయ పాలకవర్గాలతో సహా ఇతర నామినేటెడ్ పదవుల భర్తీపై పెత్తనం పూర్తిగా అధికార పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులకే అప్పగించాలని,  జిల్లాస్థాయి పదవులకు ఎంపికపై తుది నిర్ణయం అధిష్టానానికి వదిలేయాలని గురువారం నాటి చర్చల్లో మంత్రులు నిర్ణయించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేల్లేని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జిలకు పెత్తనం ఇవ్వాలన్న వాదన తెరపైకి వచ్చినా ప్రతిపక్ష ఎమ్మెల్యేల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంటుందని గుర్తించారు. శుక్రవారం నాటి సమావేశం లో ఏఏ పదవుల్లో ఎవరిని నియమించాలి, రాష్ర్ట, జిల్లా స్థాయి పదవులకు ఏ నియోజక వర్గం నుంచి ఎవరిని ప్రతిపాదించాలనే అంశంపై కసరత్తు జరగనుందని చెబుతున్నారు. కాగా వీటి భర్తీపై జిల్లాపార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఆ స్థాయి పదవులను తమ అనుకూలురకే ఇప్పించుకోవాలని పలువురు అగ్రనేతలు పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా శుక్రవారం నాటి భేటీలో విషయం తేలదని, మరోసారి భేటీ అయితే తప్ప ఒక కొలిక్కి రాదని టీడీపీ నాయకుడొకరు ‘సాక్షి’కి తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top