ఒరిగిందేమీ లేదు


నెల్లూరు (అర్బన్): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఢిల్లీలో శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజలను నిరాశపరచింది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు జిల్లాకు మేలు చేసే విధంగా కృషిచేస్తుందని భావించారు. అందులో భాగంగా బడ్జెట్‌లోనూ జిల్లాకు ప్రత్యేకంగా ప్రాజెక్టులు, నిధులు కేటాయిస్తారని ఆశగా ఎదురుచూశారు. అయితే జిల్లా ప్రజల ఆశలపై కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ నీళ్లు చల్లారు.

 

  కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా సామాన్యులకు పెద్దగా ఒరిగిందేమీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటి తగ్గింపుపై కేంద్రం దృష్టిపెట్టలేదు. అలాగే జిల్లాకు చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పుణ్యాన నెల్లూరుకు ఏదో మంచి జరుగుతుందని జిల్లావాసులు భావించారు. అయితే బడ్జెట్ ప్రకటన తర్వాత అలాంటిదేమీ లేదని తేలిపోయింది. విశాఖ-చెన్నై వరకు ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక కారిడర్‌లో నెల్లూరు జిల్లాకు స్థానం ఉంది.  సీఎం చంద్రబాబు దుగ్గరాజపట్నం ఓడరేవు, నెల్లూరు- సూళ్లూరుపేట మధ్యలో వివిధ పరిశ్రమల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే బడ్జెట్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమయ్యే సౌకర్యాలేవీ ప్రకటించలేదు. ఉద్యోగులకు సంబంధించి ఆదాయపన్ను పెంపు విషయంలో యథాస్థితిని కొనసాగించారు. ఉద్యోగులు 2.50 లక్షల నుంచి 5 లక్షలకు ఆదాయ పన్ను పెంచుతారని భావించినా అలా ఏం జరగలేదు.

 

  ఉద్యోగుల ఆరోగ్య బీమా గత బడ్జెట్‌లో రూ.15 వేలు ఉంటే దానిని రూ. 25వేలకు పెంచారు. ట్రావెల్ అలవెన్స్‌ను 800 నుంచి 1,600 పెంచి కొంత ఊరట కలిగించారు. అలాగే ఉద్యోగుల వైద్యఖర్చులకు సంబంధించి రూ. 30వేల వరకు ఎటువంటి పన్ను లేకుండా మినహాయింపు ఇచ్చారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక పాఠశాల, పది కిలోమీటర్లకు ఒక కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే రాష్ట్రం క్లస్టర్ పాఠశాలలను తెరమీదకు తెచ్చింది. క్లస్టర్ స్కూల్స్‌ను మండలానికి ఒకటి ఏర్పాటు చేస్తారు. కేంద్రం ఆలోచనకు రాష్ట్రప్రభుత్వం ఆలోచనకు చాలా వ్యత్యాసం ఉంది. దీంతో విద్యకు నిధులు అంతంతమాత్రంగానే వచ్చే అవకాశం ఉంది.

 

 చిన్న చూపు..

 కేంద్ర బడ్జెట్ అనేక వర్గాలపై చిన్నచూపు చూసింది. సిమెంట్ ధరలను పెంచుతామని ప్రకటించింది. సామాన్యుడికి పక్కాగృహం కలగా మిగలనుంది. మినరల్ వాటర్ రేట్లు కూడా పెంచే అంశాల్లో కేంద్రం చేర్చింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డులు విసృ్తతంగా వినియోగిస్తున్నారు.

 

  వీటి సర్వీసులు ఇకపై మరింత ప్రియం కానున్నాయి. డీటీహెచ్ సర్వీసులు, బట్టల డ్రైక్లీనింగ్‌పైనా ధరలు పెంచనున్నారు. ధూమపాన ప్రియులకు ఇకపై కష్టమే. సిగరేట్ ధరలు మరింత పెరగనున్నాయి. సామాన్యులకు విమానయానం అవకాశం ఇప్పట్లో ఉండకపోవచ్చు. విమాన చార్జీలను మరింత పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దేశీయంగా మొబైల్‌ఫోన్లు, కంప్యూటర్ టాబ్లెట్స్, ప్యాక్ చేసిన పండ్లు, ఆంబులెన్స్ సర్వీసులు, మైక్రోఒవెన్, ఫ్రిజ్, ఎల్‌ఈడీ బల్బులు, సోలార్ వాటర్ హీటర్ రేట్లు తగ్గనున్నాయి.

 

 రాష్ట్రాన్ని పట్టించుకోలేదు : ఎంపీ మేకపాటి

 బడ్జెట్‌లో నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇది చాలా దారుణం. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. దానికి తగ్గట్టు నిధులు మంజూరు జరగాలి. విభజన తర్వాత రాష్ట్రానికి నిధులు కేటాయించేలా కృషిచేస్తామని చెప్పిన సీఎం బాబు, కేంద్రమంత్రి వెంకయ్య హామీలు ఏమయ్యాయి. ఆ హామీలు నెరవేర్చేందుకు వారు ప్రయత్నించాలి.

 

 మాటలకే పరిమితం : ఎంపీ వరప్రసాద్

 కేంద్రప్రభుత్వం పనితీరు మాటలకే పరిమితమైంది. జైట్లీ బడ్జెట్‌లో కబుర్లు తప్ప ఒక్కటీ జరిగేదిగా లేదు. మాటలేకాని చేతల్లో లేదు. 2020 నాటికి అందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తాం అన్నారు. ఈ ఏడాది ఎంతమందికి ఎన్ని గృహాలు మంజూరు చేస్తారో చెప్పలేదు. ఎస్సీ, ఎస్టీలకు రుణాలు ఇస్తాం అని చెప్పడమే కానీ స్పష్టత లేదు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top