ఏపీకి ప్రత్యేక హోదా లేనట్టే!

ఏపీకి ప్రత్యేక హోదా లేనట్టే! - Sakshi


- పరోక్షంగా తేల్చిచెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ



న్యూఢిల్లీ/ హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా లేనట్టేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పరోక్షంగా తేల్చిచెప్పారు. కేంద్రంలో ఎన్డీయే నేతృత్వంలోని ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని అరుణ్‌జైట్లీ శనివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.



ఈ సందర్భంగా ప్రత్యేకహాదాపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామనే హామీ ఉన్నప్పటికీ, ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని, ఆ రాష్ట్రాలు ఎదుర్కొనే ఆదాయలోటును భర్తీ చేయడానికి కేంద్రం నిధులివ్వాలని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణలోకి వెళ్లడం వల్ల ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన ఆదాయాన్ని పూరించేందుకు వనరుల్ని సమకూరుస్తామని భరోసా ఇచ్చారు.



ఏదో ఒక రకంగా ఆదుకోవాలి: చంద్రబాబు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇన్నాళ్లూ డిమాండ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారు. ప్రత్యేకహోదా కోసం పట్టుబట్టకుండా... కేంద్రం ఏదో రకంగా ఆదుకుంటే చాలంటూ మాట్లాడుతున్నారు. సచివాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశం ఇందుకు వేదికైంది. ఏపీకి ప్రత్యేక హోదాపై అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలను సీఎం దృష్టికి తీసుకురాగా... ‘‘కేంద్రం ఏదో ఒక రకంగా రాష్టాన్ని ఆదుకోవాలి. ఇతర రాష్ట్రాల స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి చెందేవరకూ (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్)  సహకరించాలి. అది ప్రత్యేక హోదా ఇవ్వటం ద్వారానా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటం ద్వారానా, వెనుకబడిన ప్రాంతాలకు అభివద్ధి నిధులు విడుదల చేయడం ద్వారానా, ప్రత్యేక నిధులు మంజూరు చేయడం ద్వారానా అన్నది కేంద్రం ఇష్టం’’ అని వ్యాఖ్యానించారు. కాగ్ నివేదిక ప్రకారం రూ.14,500 కోట్ల రెవెన్యూ లోటులో ఉందని తేలిందని, తుది లెక్కల ప్రకారం అది  రూ.15,500 కోట్లకు చేరనుందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top