గజ్వేల్ లో చెమటోడుస్తున్న కేసీఆర్!

గజ్వేల్ లో చెమటోడుస్తున్న కేసీఆర్! - Sakshi

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పోటీలో నిలవడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన కేసీఆర్ ఈ స్థానం నుంచి  విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే గజ్వేల్ విజయం కేసీఆర్ కు అంత సులభంగా దక్కే అవకాశాలు కనిపించడం లేదనే అభిప్రాయం నెలకొంది. 

 

గజ్వేల్ నియోజకవర్గం నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే టి. నర్సారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దొంతి పురుషోత్తం రెడ్డి, టీడీపీ, బీజేపీ కూటమి నుంచి ప్రతాప్ రెడ్డిలు బరిలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధికి ఈ నియోజకవర్గం సమీపంలో ఉండటంతో అర్బన్ ఓటర్ల ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. 

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో తమ పాత్ర ప్రధానమైందని టీఆర్ఎస్ తన వాదనతో ప్రచారంలో ముందుకు వెళ్లోంది. ఇదిలా ఉండగా బీజేపీ, టీడీపీల పొత్తు అంశంతో మోడీ హవాను విజయంగా మలుచుకోవాలని ఆ కూటమి అభ్యర్థి ప్రతాప్ రెడ్డి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి దొంతి పురుషోత్తం రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 

 

బహుముఖ పోటి నెలకొన్న నేపథ్యంలో ఓటర్లు ఎలా స్పందిస్తారనే అంశంపై బేరిజు వేసుకుంటూ నాయకులు తమ విజయానికి వ్యూహా రచన చేస్తున్నారు. టీఆర్ఎస్ కు విజయం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో ఆపార్టీ సీనియర్ నేత హరీష్ రావు ఈస్థానంపైనే ప్రధాన దృష్టిని కేంద్రికరించారు. కేసీఆర్ తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తుండటంతో ఆయన విజయానికి అన్నితానై హరీష్ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కవిత నిజమాబాద్ లోకసభ బరిలో ఉండటం, సిరిసిల్లా స్థానం నుంచి పోటీ చేస్తున్న కేటీఆర్ అస్వస్థతకు గురికావడంతో ప్రచారం భారమంతా హరీష్ పైనే పడింది.

 

అన్ని పార్టీల అభ్యర్ధులు తమ బలాన్ని విజయానికి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ తన విజయానికి చెమట్చోల్సి వస్తోంది. స్వంత జిల్లాలో సునాయాస విజయం దక్కుతుందని భావించిన కేసీఆర్ కు మిగితా పార్టీల నుంచి ఊహించని పోటి ఎదురవ్వడం టీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. అందరి దృష్టి కేంద్రీకృతమైన గజ్వేల్ నియోజకవర్గంపై గులాబి బాస్ తన జెండాను ఏ రేంజ్ లో ఎగురవేస్తారో వేచి చూడాల్సిందే. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top