నడక యాతన


పార్వతీపురం రూరల్‌: మండలంలోని పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు చేసేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మారుమూల గ్రామాలకు సైతం పక్కా రహదారులు నిర్మించామని పాలకులు, అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నా నేటికీ రహదారి సౌకర్యాలు లేని గ్రామాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో స్థానికులు రాకపోకలు సాగించాలంటే గోతులమయమైన రాళ్లు తేలిన రహదారులపైనే ప్రయాణించాల్సి వస్తోంది.



గతంలో వేసిన మెటల్‌ రోడ్లు, మధ్య మధ్యలో గెడ్డలపై నిర్మించిన చిన్న చిన్న కల్వర్టులు శిథిలావస్థకు చేరి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. వేసవికాలంలోనే ఇలా ఉంటే వర్షాకాలంలో ఈ రహదారుల మధ్యలో నిర్మించిన వంతెనలపై రాకపోకలు చేయాలంటేనే నరకాన్ని తలపించినట్లవుతుంది.



ఈ విధంగా మండలంలోని బుదురువాడ పంచాయతీ బిత్రటొంకి, గోచెక్క పంచాయతీ లిడికివలస, డోకిశీల పంచాయతీ మెల్లికవలస, డెప్పివలస, గంజిగెడ్డ, సరాయివలస, ములగ పంచాయతీ పిండిలోవ, బిల్లగుడ్డివలస గ్రామాలకు నేటికీ పక్కా రహదారులు లేక రాళ్లుతేలిన రహదారులపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు దృష్టిసారించి ఆయాగ్రామాలకు పక్కా రహదారులు నిర్మించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.



రాకపోకలు చేయలేకపోతున్నాం

ప్రతినిత్యం డోకిశీలకు రావాలంటే రాళ్లు తేలిన రహదారిపైనే ప్రయాణించాల్సివస్తుంది. ఏళ్లు గడుస్తున్నా తమ గ్రామానికి రహదారి కష్టాలు తప్పడం లేదు.

మెల్లిక ఫిలిప్, గంజిగెడ్డగిరిజనులంటే చులకన



ఈ ప్రభుత్వానికి గిరిజనులంటే చులకన భావం. మారుమూల గ్రామాలకు సైతం పక్కా రహదారులు నిర్మిస్తామని చెబుతున్నా హామీలు ప్రకటనలవరకే పరిమితమవుతున్నాయి. కార్యరూపం దాల్చడం లేదు.

మెల్లిక రాజు, గంజిగెడ్డ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top