పావనక్షేత్రానికి ఏదీ ప్రాధాన్యం?

పావనక్షేత్రానికి ఏదీ ప్రాధాన్యం? - Sakshi


 అమలాపురం :చారిత్రిక ప్రాధాన్యం, ఆధ్యాత్మికపరంగా గుర్తింపు ఉన్న కుండలేశ్వరం వద్ద పుష్కరఘాట్, ఆలయాభివృద్ధి విషయంలో ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. పుష్కర సమయంలో రోజుకు 25 వేల మందికి పైగా భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వందల సంఖ్యలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. అయితే రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం తనకు పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఫలితంగా ఈ క్షేత్రంలో పుష్కరాలకు రానున్న భక్తుల కోసం అవస్థలు, అగచాట్లు కాచుకుని ఉన్నట్టే. ఇబ్బంది పాలు చేయనుంది. ‘వృద్ధగౌతమీ నదీపాయలో స్నానం చేసి కుండలేశ్వరుని దర్శించినా, దానం చేసినా, కనీసం నదిని తాకి స్వామిని దర్శించినా కోటి యజ్ఞాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది’ అని పురాణాలు చెబుతున్నాయి.

 

 ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. పంచభూతాలు ఉన్నంత వరకు కుండలేశ్వరంలో త్రిమూర్తులు, దేవతలు సంచరించాలని గోదావరి మాత సముద్రుడిని కోరిన ఈ క్షేత్రంలో మామూలు రోజుల్లో స్నానాలు చేస్తేనే ఎంతో పుణ్యదాయకమని, ఇక పుష్కరాల సమయంలో చేస్తే దక్కే పుణ్యం అనంతమని భక్తుల విశ్వాసం. కుండరూపంలో పరమేశ్వరుడు వెలసిన ఈ చోట, నదీగర్భంలో దేవతలు పూజించేందుకు మరో పరమేశ్వరుని విగ్రహముందని వారి నమ్మకం. ఇంతటి ఘనచరిత్ర ఉన్న కుండలేశ్వరానికి పుష్కరాల్లో రోజుకు 20 వేల నుంచి 25 వేల మంది వరకు వచ్చే అవకాశముందని అంచనా.

 

 అరకొరగా నిధులు..

 పుష్కరాలకు ఇప్పుడున్న ఘాట్‌ను విస్తరించాలని స్థానికులు, కుండలేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులు ఇరిగేషన్ శాఖను కోరారు. అయినా అధికారులు ఘాట్‌కు పడమర వైపు కేవలం పది మీటర్ల విస్తరణకు మాత్రమే ప్రతిపాదనలు పంపారు.  పిండ ప్రదానాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉండడం వల్ల ఇప్పుడున్న ఘాట్‌కు తూర్పువైపు 15 మీటర్ల వెడల్పుతో మరో ఘాట్ నిర్మించాలని ప్రతిపాదించినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదు.  

 

 అధ్వానస్థితిలో రహదారులు

 కుండలేశ్వరం వెళ్లేందుకు కాట్రేనికోన మార్కెట్ యార్డు నుంచి ఉన్న బీటీ రోడ్డు  ఇరుకుగా, అధ్వానంగా ఉంది. అయినా దీని నిర్మాణం ఊసేలేదు. 216 జాతీయ రహదారిలో కర్రివానిరేవు నుంచి కుండలేశ్వరం వరకు పటిష్టం చేసిన ఏటిగట్టు మీద బీటీ రోడ్డు నిర్మించాలని ఇరిగేషన్ శాఖ ప్రతిపాదన పంపినా నిధులు కేటాయించ లేదు.  ఏటిగట్ల పటిష్టం పనుల్లో గతంలో కర్రివానిరేవు నుంచి అయినాపురం వరకు రోడ్డు పూర్తికాగా, మిగిలిన రోడ్డు నిర్మించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయినాపురం అవుట్‌ఫాల్ స్లూయిజ్ పనులు పుష్కరాల నాటికి పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో ఇక్కడ ట్రాఫిక్ ఇక్కట్లు తప్పవు.

 

 అయినాపురం అవుట్‌ఫాల్ స్లూయిజ్ వద్ద, పంట కాలువకు అనుసంధానంగా ఉన్న చానల్స్ వద్ద వంతెనలు నిర్మించి రోడ్డును వేయాలి.  నిర్మాణ వ్యయం తేడావల్ల నష్టం వస్తోందని కాంట్రాక్టరు పనులకు నిరాకరిస్తుండడంతో ఈ రోడ్డు నిర్మాణమూ లేనట్టే.    సర్కారు చిన్నచూపు కొంత, నిధులున్నా పనులు చేయించడంలో ఇరిగేషన్ అధికారులు అలసత్వం కొంత కలిసి పుష్కరాల సమయంలో భక్తులు ఇక్కట్లు పడాల్సిన దుస్థితి కాచుకునుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు పుష్కరాల్లో కుండలేశ్వరం ప్రాధాన్యాన్ని గుర్తించి, అవసరమైన పనులు చేయించాలి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top