'దత్త' పుత్రులు.. 'ఉత్త' మాటలు


  • గ్రామాలను దత్తత తీసుకున్న ప్రజాప్రతినిధులు, ప్రముఖులు

  • రూపురేఖలు మార్చేస్తామంటూ గొప్పలు

  • తర్వాత కన్నెత్తి చూడని వైనం

  • ‘శ్రీమంతుల’ తీరుపై పల్లెవాసుల పెదవివిరుపు

  •  

    ఇది నల్లచెరువు మండలం పల్లెవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల. ఈ ఊరు స్వయాన మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్వగ్రామం. అంతేకాదు..ఈ గ్రామాన్ని మంత్రివర్యులు దత్తత కూడా తీసుకున్నారు. పాఠశాల మూతపడి రెండేళ్లకు పైగా అవుతున్నా..తిరిగి తెరిపించలేకపోతున్నారు. ప్రస్తుతమిది గొర్రెలు, మేకలకు నిలయంగా మారింది.


    ఇక గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. వీధిలైట్లు, సిమెంట్ రోడ్లు లేవు. మంచినీరూ కరువైంది. ఇక మా ‘పల్లె’ను మార్చేదెవరని గ్రామస్తులు అడుగుతున్నారు. ఒక్క పల్లెవాండ్లపల్లి మాత్రమే కాదు...జిల్లాలోని చాలా దత్తత గ్రామాల పరిస్థితి ఇదేవిధంగా ఉంది. దత్తత తీసుకునే సమయంలో రూపురేఖలు మార్చేస్తామంటూ గొప్పలు చెప్పిన ‘శ్రీమంతులు’ ఇప్పుడు పత్తా లేకుండా పోయారు.

     

    అనంతపురం: ప్రభుత్వం చెప్పిందనో..మరొకరు చేస్తున్నారనో.. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు జిల్లాలోని అనేక గ్రామాలను దత్తత తీసుకున్నారు. సొంత డబ్బు వెచ్చించి పల్లెల ప్రగతికి బాటలు వేస్తామంటూ ఘనంగా ప్రకటించారు. ఇక తమ ఊళ్ల రూపురేఖలే మారిపోతాయని స్థానికులు కూడా ఆశించారు.

     

    వారి ఆశలు అడియాసలు కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘దత్తపుత్రులు’ ప్రకటనలతో తమ పని అయిపోయినట్లు భావించి.. తర్వాత గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదు. వీరిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు  కూడా ఉన్నారు. వీరంతా ముఖం చాటేయడంతో ‘ఉత్తుత్తి శ్రీమంతులతో’ తమకు ఒనగూరేదేమీ లేదనే భావనకు పల్లెవాసులు వచ్చారు.

     

     దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో అనంతపురం జిల్లాది రెండోస్థానం.  జిల్లాలోని పల్లెల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవు. బిందెడు నీటి కోసం కిలోమీటర్లు నడిచివెళ్లే గ్రామాలు...ప్రభుత్వ నీటి ట్యాంకరు వచ్చేదాకా ఎదురుచూసే పల్లెలు...రోడ్డు సౌకర్యం లేక అల్లాడుతున్న ప్రాంతాలు చాలానే ఉన్నాయి. జిల్లాలోని 1003 పంచాయతీల్లో దాదాపు 3,500 ఆవాస ప్రాంతాలున్నాయి. వీటిలో దాదాపు 80శాతం గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.

     

     మాటలు సరే...చేతలేవీ?

     గ్రామాలను దత్తత తీసుకునే సంప్రదాయం దేశంలో రెండేళ్ల కిందట మొదలైంది. ఈ పరంపరలో ‘అనంత’ నేతలు కూడా దత్తతపై ఆసక్తి చూపారు. కొందరు స్వగ్రామాలను, ఇంకొందరు వారికి నచ్చిన పల్లెలను దత్తత తీసుకున్నారు. ఇంకొందరు అధికారుల సలహా తీసుకుని వెనుకబడిన గ్రామాలపై దృష్టిసారించారు.  మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆయన స్వగ్రామం పల్లెవాండ్లపల్లిని దత్తత తీసుకున్నారు.


    ఈయన మంత్రిపదవిలో ఉండటమే కాకుండా.. ఆర్థికంగా కూడా ఉన్నవారు. అయినప్పటికీ స్వగ్రామం అభివృద్ధిపై చిత్తశుద్ధి చూపడం లేదన్న విమర్శలున్నాయి.  బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ కనగానపల్లి మండలంలోని ముత్తువకుంట్లను దత్తత తీసుకున్నట్లు జనవరిలో జిల్లాకు వచ్చిన సందర్భంగా ప్రకటించారు. తర్వాత ఒకసారి మాత్రమే ఆ గ్రామాన్ని సందర్శించారు.

     

     సిమెంట్‌రోడ్లు, సోలార్‌లైట్లు వేయించడం మినహా  ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి గొట్లూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దీని పరిస్థితే అంతే! ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఏకంగా మడకశిర మునిసిపాలిటీని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందులో ఇప్పటి వరకూ  ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పెద్దవడుగూరును దత్తత తీసుకున్నారు.

     

     జేసీ ప్రకటన చేయగానే తాడిపత్రి స్థాయిలో తమ ఊరు అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు భావించారు. కానీ అలాంటి పరిస్థితేమీ కన్పించలేదు. చిన్నపాటి వర్షమొచ్చినా పెద్దవడుగూరు రోడ్లన్నీ మురికికూపాలుగా మారుతున్నాయి. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి నగరంలోని రాజీవ్‌కాలనీని దత్తత తీసుకున్నా.. ఇక్కడింకా అభివృద్ధికి బీజం పడలేదు. ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డి దత్తత గ్రామమైన గుమ్మఘట్ట మండలం బేలోడును సందర్శించిన ప్రతిసారీ హామీలు గుప్పించడం తప్ప ఒక్కటీ ఆచరణలో పెట్టలేదు. వీరే కాకుండా, ఇలా చాలామంది ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకున్నా.. తర్వాత వాటి అభివృద్ధిని విస్మరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top