ఏ నిమిషానికి ఏ బండ కూలునో!

ఏ నిమిషానికి  ఏ బండ కూలునో! - Sakshi


తిరుమల ఘాట్‌లో కూలుతున్న కొండ చరియలు

భయం భయంగా ప్రయాణం

నిపుణులు హెచ్చరించినా పట్టించుకోని ఫలితం


 

తిరుమల:  తిరుమల ఘాట్ రోడ్లలో ఏ నిమిషంలో ఏ బండ కూలుతుందోనన్న ఆందోళన నెలకొంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇరవై ప్రాంతాల్లో బండరాళ్లు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్లలో ప్రయాణించేం దుకు భక్తులు భయపడుతున్నారు. శాశ్వత చర్యలు తీసుకోవడంలో టీటీడీ ఉన్నతాధికారులు చొరవ చూపటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.



 రెండో ఘాట్‌లో 20కిపైగా సమస్యాత్మక ప్రాంతాలు

 1944 ఏప్రిల్ 10న తొలి ఘాట్ రోడ్డు నిర్మించారు. రాకపోకలు ఒకే రోడ్డులో జరిగేవి. శ్రీవారి దర్శనం కోసం యాత్రికులు పెరిగారు. 1960లో రెండో ఘాట్‌రోడ్డుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అనువైన మార్గాన్ని సర్వే చేసి 1969 నుంచి 1973 మధ్య కాలంలో రెండో ఘాట్ రోడ్డును నిర్మించారు. అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గోకరాజు గంగరాజు రోడ్డు నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. అలిపిరి నుంచి ఏడు కిలోమీటర్ల తర్వాత నుంచి 16వ కిలోమీటరు వరకు కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయి. వరుసగా రెండు రోజుల పాటు ఓ మోస్తరులో వర్షం కురిస్తే చాలు భారీ స్థాయిలో కొండ చరియలు విరిగి పడటం సాధారణమైపోయింది. శ్రీవారి ఆశీస్సులతో ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. కొండచరియల కారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులోనూ, ఈ ఏడాది మూడు దఫాలుగా కొండ చరియలు కూలాయి.



 నిపుణుల సూచనలు పట్టించుకోని టీటీడీ

 కొండచరియలు కూలే ఘాట్ రోడ్డు ప్రాంతాలను ఐఐటీ ఇంజినీరింగ్ నిపుణులు నరసింహారావు సందర్శించారు. ఇక్కడ ఉన్న రాతిశిలల నిర్మాణంపై, వాటి భవిష్యత్ స్థితిగతులపై స్వయంగా అధ్యయనం చేశారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 20 ప్రాంతాల్లోని కొండరాళ్లను దశలవారీగా తొలగించాలని నివేదిక సమర్పించారు. అవసరాన్ని బట్టి రాక్‌బౌల్టర్‌ట్రాప్, రివిట్‌మెంట్లు నిర్మించాలని సూచించారు. దశాబ్దకాలం ముందు త్రోవ భాష్యకార్ల సన్నిధి సమీపంలోని మలుపు వద్ద చేపట్టిన భద్రతా చర్యలను కూడా అమలు చేయాలని సిఫారసు చేశారు. వీటిని టీటీడీ ఉన్నతాధికారులు లెక్కలోకి తీసుకోలేదు. కూలే రాళ్ల తొలగింపులో తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా వర్షం వచ్చిన సందర్భాల్లో రాళ్లు కూలటం రివాజుగా మారింది.



 ఘాట్ ప్రయాణంలో స్వీయ అప్రమత్తత తప్పనిసరి

 వర్షాల వల్ల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు కూలుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ప్రయాణించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే ఘాట్‌రోడ్డులో ఏడో కిలోమీటరు నుంచి తిరుమలకు వచ్చే వరకు ఇలాంటి పరిస్థితులున్నట్టు ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. వాహనదారులు కుడివైపున కొండలు ఆనుకుని కాకుండా ఎడమవైపు ప్రయాణం చేయాలని సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తలకు హెల్మెట్ వాడటం శ్రేయస్కరమని హెచ్చరిస్తున్నారు. ఘాట్ రోడ్డులో మొబైల్ పార్టీలతో గస్తీ పెంచారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top