మందుల్లేవ్.. మళ్లీ రండి


విజయనగరం ఫోర్ట్: విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం గేదలవానిపాలేం గ్రామానికి ఒక వ్యక్తి తన కుమార్తెకు హెచ్‌ఐవీ మందుల కోసం జిల్లా కేంద్రాస్పత్రిలోని ఏఆర్‌టీ కేంద్రానికి రెండు నెలల వ్యవధిలో నాలుగు సార్లు వచ్చాడు. మందులు లేవని సిబ్బంది అతన్ని తిప్పి పంపించారు. నాలుగు సార్లు విజయనగరం వచ్చి వెళ్లడానికి రూ.600 ఖర్చు అయింది.. మందులు మాత్రం దొరకలేదు. ఈ పరిస్థితి నిత్యం హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు ఏఆర్‌టీ కేంద్రంలో ఎదురవుతోంది.


ప్రభుత్వం మందులు సరఫరా చేయకపోవడంతో సిబ్బంది కూడా ఏమీ చేయలేక మందులు లేవని తిప్పి పంపించేస్తున్నారు. ఇది ఎయిడ్స్ వాధిగ్రస్తులను ఆందోళనకు గురిచేస్తోంది. జీవితకాలాన్ని పెంచుకోవడానికి అవసరమైన మందులు రెండు నెలలుగా లేకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారు. హెచ్‌ఐవీతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ఏఆర్‌టీ మందులు వాడాలని, లేదంటే రోగ నిరోధకశక్తి తగ్గిపోతుందని పదే పదే చెప్పే ప్రభుత్వం మందుల సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.



మందులు వీరు వాడాలి

సిడిఫోర్ కౌంట్ (రోగ నిరోధకశక్తి) 350 కంటే తక్కువగా ఉన్నవారు మందులు వాడాలి. ఏఆర్‌టీ మందులను వాడటం ఒకసారి ప్రారంభించాక జీవితాంతం వాడాలి. మధ్యలో మానేస్తే రోగ నిరోధక శక్తి క్షీణించి మృత్యువాత పడే అవకాశం ఉంది.



హెచ్‌ఐవి రోగుల వివరాలు

జిల్లాలో 13 వేల మంది హెచ్‌ఐవీ రోగులున్నారు. వీరిలో 10,493 మంది ఏఆర్‌టీ కేంద్రంలో నమోదవగా 7634 మంది మందులు తీసుకుంటున్నారు. వీరిలో 263 మంది పిల్లలున్నారు. జిల్లాలో 2071 మంది హెచ్‌ఐవి రోగులు చనిపోగా వారిలో 42 మంది పిల్లలున్నారు. జెడ్‌ఎల్‌ఎన్-60, ఏబీసీ-3టీసీ, ఎన్‌వీపీ మందులను పిల్లలకు ఏఆర్‌టీ కేంద్రంలో అందజేస్తారు. ఇందులో హిమోగ్లోబిన్( హెచ్‌బి) 9గ్రాముల కంటే తక్కువగా ఉన్నవారికి ఎన్‌వీపీ, ఏబీసీ-3టీసీ మందులు అందజేస్తారు. తొమ్మిది గ్రాములు, అంతకంటే ఎక్కువగా హెచ్‌బీ ఉన్న వారికి జెడ్‌ఎల్‌ఎన్ -60 మందులను అందజేస్తారు. ఈ మందులను 80 మంది పిల్లలు వరకు వాడేవారు.  ప్రస్తుతం వీటిలో జెడ్‌ఎల్‌ఎన్ -60 మందుల కొరత ఏర్పడింది. రెండు నెలలుగా ప్రభుత్వం ఈ మందులను సరఫరా చేయలేదు.  

 

జెడ్‌ఎల్‌ఎన్-60 మందు సరఫరా కాలేదు. దీంతో ఏఆర్‌టీ కేంద్రానికి వచ్చిన వారికి ఫోన్ చేసి రమ్మంటున్నాం. నాలుగు, ఐదు రోజుల్లో మందులు వచ్చే అవకాశం ఉంది. -ఆర్.శంకర్‌రావు, సీనియర్ వైద్యాధికారి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top