అంతా..బుస్!


 కర్నూలు(హాస్పిటల్): ఇప్పుడిప్పుడే వర్షాలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ పనుల కోసం రైతులు, కూలీలు పొలాలకు వెళ్తున్నారు. పొదల మాటున, బొరియల్లో ఉండే పాములను గమనించక వాటి కాటుకు గురవుతున్నారు. ఈ సమయంలో వీరి ప్రాణాలు నిలపాల్సిన యాంటీ స్నేక్ వీనమ్(ఏఎస్‌వీ)లు అందుబాటులో ఉండటం లేదు. ఆరోగ్య శాఖ అలసత్వంతో అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ లభ్యం కావడం లేదు. చాలా పీహెచ్‌సీల్లో దీన్ని నిల్వ చేసుకునేందుకు సౌకర్యాలు లేవు.



ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల్లో పాము కాటు వేస్తే... కాటికే వెళ్తారన్న విమర్శలు ఉన్నాయి. అలాగే నాటు వైద్యం వైపు కూడా ప్రజలు మొగ్గుచూపడంతో ఈ సమస్య నెలకొందన్న అభిప్రాయం ఉంది. గ్రామీణ ప్రజలకు వైద్యం అందించేందుకు జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటికి అదనంగా 16 సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ) ఏర్పాటు చేశారు. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో 3,371 యాంటీ స్నేక్ వ్యాక్సిన్లు స్టోరేజ్‌లో ఉన్నాయి. అధికారికంగా రూ.6, 38, 35 విలువ చేసే వీటిని కొన్ని మండలాలకు తరలించినట్లు తెలుస్తోంది.



ఈ ఏడాది మే నెల 12వ తేదీ సంజామల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, 13వ తేదీ పెద్దయమ్మనూరు, 15వ తేదీ చిప్పగిరి, 22న కోడుమూరు, జూన్ నెల 6న ఆలూరు, 11న పత్తికొండ, వేల్పనూరు, 14న ఎమ్మిగనూరు, 17న ఆదోని, 22న డోన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే చాలా చోట్ల ఈ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. పాణ్యం నియోజకవర్గం పరిధిలోని ఓర్వకల్లు, గడివేముల మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వీటి కొరత ఉంది.



కొన్ని పీహెచ్‌సీల్లో వీటిని నిల్వ చేసేందుకు సదుపాయాలు లేవు. దీంతో విషసర్పాలు, విష పురుగుల కాటుకు గురైనవారు అక్కడి వెళ్తే చికిత్స అందడం లేదు. వేరొక ఆసుపత్రికి వెళ్లేలోగా మృత్యువాత పడుతున్నారు. మృతులు వందల్లో ఉంటున్నా అధికారుల తమ రికార్డుల్లో పదుల సంఖ్యలో నమోదు చేస్తున్నారు. విలువైన ప్రాణాలు పోతున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిద్రమత్తు వీడటం లేదన్న విమర్శలున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top