సార్లొస్తే కొత్త అల్లుళ్లమే..

సార్లొస్తే కొత్త అల్లుళ్లమే..


► స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీతో

► కడప స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థి




విజయవాడ స్పోర్ట్స్‌: ‘సార్‌... మా స్పోర్ట్స్‌ స్కూల్‌ను తనిఖీ చేయడానికి మీలాంటి సార్లొస్తే ఆ రోజుకు మేము కొత్తగా అత్తారింటికి వచ్చిన అల్లుళ్లమైపోతాం. కొత్త అల్లుళ్లు అత్త గారి ఇంటికొస్తే ఎలా చూస్తారో అలా చూస్తారు. పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తారు సార్‌. ఆ తరువాత మీరు వెళ్లిపోతే మా పరిస్థితి దారుణం. సరైన భోజనం పెట్టరు. మమ్మల్ని సరిగా పట్టించుకోరు. మొన్నటికి మొన్న శాప్‌ ఓఎస్‌డీ రామకృష్ణ గారు వచ్చారు. మమ్మల్ని భలేగా చూసుకున్నారు సార్‌. ఆ తరువాత మళ్లీ మామూలే. పరిగెడదామంటే సరైన ట్రాక్‌ ఉండదు. పలుగువేసి దిగేసినా ఆ ట్రాక్‌లో దిగదు. ఎగుడు దుగుడు ట్రాక్‌పై పరిగెత్తాలంటే మా యాంకిల్‌పోతోంది సార్‌. ట్రాక్‌ షూట్‌లు, స్పైక్‌లు, క్రీడా వస్తువులు ఇవ్వరం’టూ విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాల్లో అథ్లెట్లకు ఏర్పాటు చేసిన సమ్మర్‌ రెసిడెన్షియల్‌ క్యాంపులో ఓ విద్యార్థి రాష్ట్ర క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు.



బుధవారం స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(శాప్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాంపును ఆయన సందర్శించారు. క్యాంపు గురించి ఆరా తీస్తున్న ఆయనకు వైఎస్సార్‌ జిల్లా కడప స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థి (అథ్లెట్‌) వివేకానంద అక్కడ పరిస్థితులను వివరించారు. దీనికి స్పందించిన ఎల్‌వీ సుబ్రహ్మణ్యం కడప స్పోర్ట్స్‌ స్కూల్‌ ఇన్‌చార్జి  సరిగా పనిచేయకపోతే సస్పెండ్‌ చేయాలని ఓఎస్‌డీ రామకృష్ణకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం క్యాంపులో పాల్గొన్న అథ్లెట్లతో ఫొటోలు దిగారు.



 లక్ష్యాన్ని నిర్దేశించుకోండి

క్రీడాకారులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఏకాగ్రతతో సాధన చేస్తే విజయవరిస్తుందని రాష్ట్ర క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. క్యాంపు కోచ్‌ డీఎన్‌వీ వినాయక ప్రసాద్‌ను అభినందించారు.   కార్యక్రమానికి కళాశాల పీడీ నాగేంద్ర ప్రసాద్‌ అధ్యక్షత వహించగా ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ జీఏపీ కిషోర్‌ గౌరవ అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో శాప్‌ ఓఎస్‌డీ పీ రామకృష్ణ, ఏపీ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌S కార్యదర్శి ఏవీ రా«ఘవేంద్ర, జిల్లా కార్యదర్శి ఎన్‌ నాగేశ్వరరావు, శాప్, అసోసియేషన్‌ కోచ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్వీ సుబ్రహ్మణ్యంను అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ రాఘవేంధ్ర , ఇతర సభ్యులు, కోచ్‌లు ఘనంగా సత్కరించారు.



స్పోర్ట్స్‌ డిగ్రీ అందించేందుకు సిద్ధం

ప్రతిగల క్రీడాకారులకు స్పోర్ట్స్‌ డిగ్రీ కోర్సు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్ర లయోల కళాశాల ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ జీఏపీ కిషోర్‌ అన్నారు. చైనా, క్యూబా దేశాల్లో మాదిరిగా క్రీడాకారులకు ప్రత్యేక సిలబస్‌తో విద్యనందిస్తే విద్యార్థులకు ఉపయోగమని చెప్పారు. దీనిపై జూన్‌ మొదటి వారంలో సమావేశమవుదామని ఎల్‌వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top