హడావుడి ఫుల్.. అభివృద్ధి నిల్


సాక్షి ప్రతినిది, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పడి  నేటికి ఏడాది పూర్తయింది. అయితే ఎక్కడా అభివృద్ధి పనులు జరిగిన దాఖలాలు కనిపించలేదు. కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. అయితే పాలకపక్షం అనుకున్న పనుల్లో ఒక్కటైతే సాధించగలిగారని... అది కమిషనర్ చక్రధర్‌బాబుని బదిలీ చేయించడమంటున్నారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అత్యధిక డివిజన్లను దక్కించుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీడీపీ దొడ్డిదారిన మేయర్, మరికొందరు కార్పొరేటర్లను లాక్కుని పీఠం మాదేనని చెప్పుకున్నారు.

 

  ఇదేమి అన్యాయం అని పలువురు ప్రశ్నిస్తే.. నగర అభివద్ధి కోసమే పార్టీ మారానని మేయర్ అజీజ్ సాకులు చెప్పుకొచ్చారు. అదేవిధంగా టీడీపీ నేతలు సైతం అదే చెప్పి అపవాదు నుంచి బయటపడేందుకు యత్నించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది.. అదేవిధంగా సీఎం చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన నారాయణ మున్సిపల్ మంత్రిగా ఉన్నారని.. ఈ దెబ్బతో నెల్లూరు రూపురేఖలు మారిపోతాయని అంతా భావించారు. ఇదే క్రమంలో అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ప్రకటనలతో హడావుడి చేస్తూ జనాన్ని మభ్యపెట్టారు.

 

 ఏదీ స్మార్ట్‌సిటీ..?

 భారత దేశంలోనే నెల్లూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు.. ఇటు రాష్ట్రమంత్రి నారాయణతో పాటు సాక్షాత్తు సీఎం చంద్రబాబే ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. అందులోభాగంగా నెల్లూరును ‘స్మార్ట్ సిటీ’ చేస్తామన్నారు. అదే విధంగా ‘నుడా’గా మారుస్తామన్నారు. ఇకపోతే దర్గామిట్టలోని స్వర్ణాల చెరువు చుట్టూ ‘నెక్లెస్ రోడ్డు’ను నిర్మిస్తామని ప్రకటనలు చేశారు. వీటిలో ఇప్పటివరకు ఏ ఒక్కటీ తెరపైకి రాలేదు. స్మార్ట్‌సిటీ లేదని తేలిపోయింది. నుడా ప్రతిపాదన కూడా అదేదారిలో దాటవేస్తారా?లేదా? అనేది తెలియాల్సి ఉంది. నెక్లెస్ రోడ్డు ప్రతిపాదనలకే పరిమితమైంది. అదేవిధంగా నగరంలో పారిశుధ్యం గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. స్వచ్ఛనెల్లూరును ప్రారంభించినా ఆ దిశగా పాలకవర్గం కృషిచేసిన దాఖలాలు లేవు. ఎక్కడ వేసిన చెత్త అక్కడే నిల్వ ఉంది. అదేవిధంగా మురికి కాలువల్లో పూడికతీతను పట్టించుకోలేదు.

 

 అరకొరగా తీసి.. పూర్తిస్థాయిలో పూడిక తీస్తున్నట్లు లెక్కలు చూపి నిధులు నొక్కేస్తున్నట్లు విమర్శలున్నాయి. నగరమంతా దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో దోమల ఉత్పత్తి పెరిగిపోయింది. వాటి నివారణకు ఫాగింగ్ చేయాల్సి ఉన్నా.. పాలకవర్గం పట్టించుకోలేదు. దీంతో సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ సొంత నిధులతో నగరంలో పలుచోట్ల ఫాగింగ్ చేయిస్తున్నారు. అధికారపార్టీ నేతల్లో మాత్రం చలనలేకపోవటం గమనార్హం.

 

 పడకేసిన పాలన

 కార్పొరేషన్‌లో పాలన సైతం పడకేసింది. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రతి మూడునెలలకొకసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉంది. తమ తప్పులను ప్రతిపక్ష పార్టీ నేతలు ఎక్కడ నిలదీస్తారోనని భయంతో కౌన్సిల్ సమావేశాలు పెట్టేందుకు భయపడుతున్నారు. ఇప్పటివరకు నాలుగు సమావేశాలు నిర్వహించాల్సి ఉంటే.. కేవలం రెండింటికే పరమితమయ్యారు.

 

  అదేవిధంగా కీలకమైన స్టాండింగ్ కమిటీ ఎన్నికైనా.. ఇప్పటివరకు ఎటువంటి సమావేశాలు నిర్వహించకపోవటం గమనార్హం. దీంతో నగర అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. ఇకనైనా నగర అభివృద్ధిపై దృష్టిసారించాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top