కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం వద్దు

కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం వద్దు - Sakshi


మంత్రులను వారించిన చంద్రబాబు

  సాక్షి, హైదరాబాద్: పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రం తుంగలో తొక్కడానికి నిరసనగా మంత్రివర్గం తీర్మానం చేయాల్సిన అవసరం లేదంటూ సీఎం చంద్రబాబు అడ్డుకట్టవేశారు. కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని చెప్పారు.  దూకుడుగా వ్యవహరించడం వల్ల ఒరిగేదేమీ లేదని చెప్పుకొచ్చారు. సామరస్యపూర్వకంగా నిధులు రాబట్టుకోవాలన్నారు. ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోలేదని ప్రజలు గ్రహించారని, ఈ సమయంలో ప్రభుత్వం తీవ్రంగా స్పందించినా ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.

 

 నిధులకోసం మరోసారి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిని కలవాలని నిర్ణయించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వకపోవడం, ప్రత్యేక హోదా కల్పించకపోవడం.. రెవెన్యూ లోటును పూడ్చేలా నిధులు కేటాయించకపోవడం, పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేసేలా నిధులు మంజూరు చేయకపోవవడం తదితర అంశాలపై బుధవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా చర్చించింది. అలాగే కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నారని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విపక్షం చేసే విమర్శలను ఎలా తిప్పికొట్టాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది.

 

  కొందరు మంత్రులు రాష్ట్రం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళితే.. విపక్షాల విమర్శలకు చెక్ పెట్టవచ్చునని ఓ సీనియర్ మంత్రి ప్రతిపాదించారు.  చంద్రబాబు  తోసిపుచ్చినట్లు సమాచారం. నిధులు రాబట్టడంలో ప్రభుత్వం విఫలమైందని శాసనసభ సమావేశాల్లో విపక్షం దాడి చేస్తే.. ‘కేంద్రం తీరును నిరసిస్తూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెడతాం. 2015-16 బడ్జెట్ ప్రతిపాదనలను సవరించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం, రెవెన్యూ లోటు పూడ్చేలా నిధులు కేటాయించడం, పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలోగా పూర్తిచేయాలని ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టే తీర్మానానికి మద్దతు ఇవ్వండని కోరదాం. తద్వారా విపక్షం దాడిని తిప్పికొట్టవచ్చు’ అని సీఎం  హితోపదేశం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో టీడీపీ కొనసాగుతున్న నేపథ్యంలో వారితో ఘర్షణ పూరితంగా వ్యవహరించటం సరికాదని ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా సూచించారు. విభజన బిల్లులో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ప్రధానమంత్రికి లేఖ రాయాలని  తీర్మానించింది.  

 

 రాష్ట్ర కేబినెట్ ముఖ్య నిర్ణయాలివీ..

 ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత వస్తున్న తొలి తెలుగు సంవత్సరాది (ఉగాది) వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు.  సచివాలయంలో బుధవారం సీఎం నేతృత్వంలో మంత్రివర్గం సమావేశమైంది. ఉదయం 10.45 గంటలకు ప్రారంభమైన భేటీ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. విశ్వసనీయ వర్గాల మేరకు కేబినెట్  నిర్ణయాలు ఇవీ..

 

  భూమిని అప్పగించిన రైతులకు ఎకరానికి రూ.50 వేల చొప్పున పదేళ్లపాటూ ఇచ్చే పరిహారం పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పరిహారాన్ని మార్చి 31లోగా పంపిణీ చేయాలి.  ఏప్రిల్ 1 నుంచి అర్హులైన వారికి కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలి.  ప్రతి మండలానికి ఓ ఇసుక రీచ్‌ను గుర్తించి.. మహిళా సంఘాలకు అప్పగించాలి.  రెండోవిడత రుణ మాఫీని నెలాఖరులోగా పూర్తి చేయాలి.  పరిశ్రమల ఏర్పాటుకు పది లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎకరం వరకూ భూ కేటాయింపు అధికారాన్ని కలెక్టర్లకు దఖలు పరచడం.  సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు 84 రోజులపాటు సమ్మె చేశారు. ఆ రోజు లను ప్రత్యేక సెలవు దినాలుగా పరిగణించాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top