తేలని పింఛన్ల జాబితా


మచిలీపట్నం :  జిల్లాలో పింఛనుదారుల అర్హత జాబితా ఇంకా కొలిక్కి రాలేదు. అక్టోబర్ రెండో తేదీ నుంచి అర్హులైన వృద్ధులు, వితంతువులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు, 80 శాతం కన్నా వైకల్యం అధికంగా ఉన్న వికలాంగులకు రూ.1500 పింఛను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ నెల ప్రారంభమవుతున్నా జిల్లాలో పింఛనుదారుల వివరాల సేకరణ ఇంకా పూర్తికాలేదు. జిల్లాలో మొత్తం 3,12,185 మంది లబ్ధిదారులు వివిధ రకాల పింఛన్లు తీసుకుంటున్నారు.



వారిలో ఇప్పటివరకు 2,97,710 పింఛనుదారుల వివరాలు పరిశీలించిన అధికారులు 12,857 మందిని అనర్హులుగా గుర్తించారు. ఇంకా 16,475 మందికి సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించాల్సి ఉంది. వీరిలో ఎంతమంది అనర్హులుగా ఉంటారో తేల్చాలి. అధికారులు పింఛనుదారుల వివరాలు సేకరించే సమయంలో వారికి ఉన్న రేషన్ కార్డు, ఆధార్ కార్డులు రెండుచోట్ల నమోదయ్యాయా అనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెండుచోట్ల నమోదై ఉంటే ఒకచోట తొలగిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రెండున్నర ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల మెట్ట భూమి ఉంటే వారిని అనర్హులుగా గుర్తిస్తున్నారు.



 వితంతు పింఛను పొందేవారి వద్ద మరణ ధ్రువీకరణ పత్రాలు లేకపోవటంతో వారు పింఛను వస్తుందా, రాదా అనే అంశంపై లోలోపల మధనపడుతున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరికి వృద్ధాప్య పింఛను వస్తుంటే వారిలో ఎవరికి నిలిపివేస్తారోననే అంశంపైనా చర్చ సాగుతోంది. పింఛన్ల తుది జాబితా ఇంకా ఖరారు చేయలేదని, త్వరితగతిన పూర్తిచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీఆర్డీఏ పీడీ రజనీకాంతారావు తెలిపారు. కొత్తగా వివిధ రకాల పింఛన్ల మంజూరు కోసం 25 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top