వుడా బాస్ సీఎం

వుడా బాస్ సీఎం - Sakshi

  • చైర్మన్ నియామకానికి చంద్రబాబు నో

  • సీఎమ్మే ఇక నుంచి చైర్మన్

  • ‘వీఎండీయే’గా రూపాంతరం చెందనున్న వుడా!?

  • సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : వుడాకు ఇక సర్వం సీఎం చంద్రబాబే!. వుడా పూర్తిగా సీఎం చంద్రబాబు ప్రత్యక్ష నియంత్రణలోకి వెళ్లిపోనుంది.  టీడీపీ తమ్ముళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూ వుడాను చంద్రబాబు గుప్పిటపట్టారు. వుడాకు ప్రత్యేకంగా చైర్మన్‌నుగానీ రాజకీయ నామినేటెడ్ చైర్మన్‌నుగానీ సభ్యులనుగానీ నియమించకూడదని నిర్ణయించుకున్నారు. సీఎం చంద్రబాబే వుడా చైర్మన్‌గా వ్యవహరిస్తారు.  ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు వుడా స్వరూపాన్ని కూడా ప్రభుత్వం సమూలంగా మార్చనుంది. పరిధి విస్తరణతోపాటు మౌలిక మార్పులను తీసుకురావాలని నిర్ణయించింది. వుడాను ‘విశాఖపట్నం మెట్రోపాలిటిన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎండీఏ)గా మార్చే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

     

    ఇదీ నిర్ణయం



    వుడా పాలకమండలికి రాజకీయ నామినేటెడ్ పోస్టులను నియమించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.  రాజకీయపరంగా చైర్మన్‌నుగానీ సభ్యులనుగానీ నియమించరు. సీఎం చంద్రబాబే వుడాకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఐదుగురు సీనియర్ ఐఏఎస్‌లతోపాటు మరో పదిమంది అధికారులు సభ్యులుగా ఉంటారు. ఐదుగురు సీనియర్ ఐఏఎస్‌లతో ఒకరు వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.  సీఎం చైర్మన్‌గా, బ్యూరోక్రాట్లతో కూడిన ఈ పాలకమండలే వుడాకు సంబంధించిన అన్ని విధాన నిర్ణయాలను తీసుకుంటుంది.  అదే విధంగా వుడా పరిధిని కూడా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.



    ఇంతవరకు ఉత్తరాన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వరకు , దక్షిణాన తుని వరకు వుడా పరిధి కింద ఉంది. మొత్తం 5,373 చ.కి.మీ. పరిధిలో విస్తరించి  ఉంది.  దాన్ని ఉత్తరాన ఇచ్ఛాపురం వరకు విస్తరిస్తారు. దక్షిణాన ఎంతవరకు విస్తరించాలన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా వుడా పరిధిని విస్తరించాలని భావిస్తున్న ప్రభుత్వం దాని స్వరూపాన్ని కూడా సమూలమార్పుల దిశగా యోచిస్తోంది. వుడాను ‘విశాఖపట్నం మెట్రోపాలిటిన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎండీఏ)గా మార్చే అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. అందులో మొదటి అడుగునానే వుడాకు ప్రత్యేకంగా చైర్మన్‌నుగానీ సభ్యులనుగానీ నామినేట్ చేయకూడదని నిర్ణయించినట్లు సమాచారం.

     

    స్మార్ట్‌సిటీ ప్రతిపాదనతోనే మారిన సీఎం ఆలోచన




    స్మార్ట్‌సిటీ ఆలోచన మొగ్గ తొడగ్గానే వుడాకు ప్రత్యేకంగా చైర్మన్‌ను నియమించకూడదని సీఎం చంద్రబాబు భావించారు. స్మార్ట్‌సిటీగా భారీ ఎత్తున నిధులు వస్తాయి. కాబట్టి వుడాను పూర్తిగా తన ఆధీనంలోనే ఉంచుకోవాలన్నది ఆయన  ఉద్దేశం. ఇక ప్రధాని నరేంద్ర మోదీ నెలరోజుల క్రితం అమెరికా అధ్యక్షుడితో చర్చల సందర్భంగా విశాఖపట్నంను స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అందుకు ఒబామా సుముఖంగా స్పందించారు. దాంతో అమెరికా నిధులు కూడా భారీగా వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ పరిణామాలతో వుడా కీలకంగా మారిపోయింది.

     

    ఎందుకంటే స్మార్ట్‌సిటీ అనేది పూర్తిగా వుడా ఆధ్వర్యంలోనే నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే అంతటి కీలకమైన వుడాను పూర్తిగా తన ప్రత్యక్ష నియంత్రణలోనే ఉంచుకోవాలని సీఎం చంద్రబాబు తుది నిర్ణయానికి వచ్చేశారు. సీఎం తనకు పూర్తి విధేయుడిగా ఉన్న స్థానిక నేతను చైర్మన్‌గా నియమించుకోవచ్చును. ఇంతవరకు జరుగుతున్నదదే. కానీ సీఎం మాత్రం ఆమాత్రం కూడా ఇతరులకు అవకాశం ఇవ్వకూండా పూర్తిగా వుడాను తన ప్రత్యక్ష నియంత్రణలోనే ఉంచుకోవాలని సీఎం చంద్రబాబు భావించారు. స్మార్ట్‌సిటీ ప్రతిపాదనతో భారీగా రాననున్న విదేశీ నిధులు....వీఎండీఏ ప్రతిపాదనతో సమూలంగా మారనున్న స్వరూపస్వభావాలు సీఎం నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉంటాయని తెలుస్తోంది.

     

    తమ్ముళ్ల ఆశలు ఆవిరే!



    వుడా చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న టీడీపీ తమ్ముళ్ల ఆశలు అడియాశలే అయ్యాయి. పదేళ్లుగా ప్రతిపక్షంలో పార్టీ కోసం పనిచేసిన తమకు వుడా పదవి దక్కకపోతుందా అని పలువురు ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్టు రాకపోయినా పార్టీ కోసం పనిచేసిన నియోజకవర్గ స్థాయి నేతలు కొందరైతే... గెలిచిన సిటీ ఎమ్మెల్యేలు ఇద్దరుముగ్గురు కూడా వుడా చైర్మన్ పదవి కోసం హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇక వుడా డెరైక్టర్ పదవుల ఆశావాహుల క్యూ చెంతాడంత పెద్దగా ఉంది. కానీ వుడాకు అసలు చైర్మన్‌గానీ సభ్యులనుగానీ నియమించకూడదన్న సీఎం చంద్రబాబు నిర్ణయం ఆ ఆశావాహులందరికీ అశనిపాతంగానే మారనుంది.

     

    ద్రోణంరాజు నుంచి టీఎస్‌ఎన్‌రాజు వరకు



    1978లో ఏర్పడిన వుడాకు ద్రోణంరాజు సత్యన్నారాయణ మొదటి చైర్మన్‌గా వ్యవహరించారు. అనంతరం అప్పలనర్సింహం, డీవీ సుబ్బారావు, ఎంవీవీఎస్ మూర్తి, మరియాదాస్, సూర్రెడ్డి, గంగిరెడ్డి, రెహమాన్, టీఎస్‌ఎన్ రాజులు చైర్మన్లుగా బాధ్యతలు నిర్వహించారు. ఇక తాజాగా వుడాకు చైర్మన్‌ను నియమించకూడదన్న నిర్ణయంతో ఇక నుంచి సీఎం చంద్రబాబే వుడాకు అధ్యక్షుడిగా ఉండనున్నారు. అదే విధంగా 10మంది నామినెటెడ్ సభ్యులు ఉండేవారు. ఇక నుంచి పూర్తిగా బ్యూరోక్రాట్లే సభ్యులుగా ఉండనున్నారు. మరి భవిష్యత్తులోవుడా దశాదిశా ఎలా ఉండనున్నాయో చూడాల్సిందే.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top