తాడేపల్లిగూడెంలోనే నిట్

తాడేపల్లిగూడెంలోనే నిట్


కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

 

 సాక్షి, హైదరాబాద్ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)ను పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి మంగళవారం లేఖ పంపారు. ఇంతకుముందు ఏలూరు-విజయవాడ మధ్యలో ఏర్పాటుకు దాదాపుగా ఖరారు అయింది. ఈ తరుణంలో ఆ జిల్లాకు చెందిన మంత్రి మాణిక్యాలరావు తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయాలని కోరుతూ తమ పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిని, కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వానికీ అదే విషయం వివరించారు. దీంతో తాడేపల్లిగూడెంలో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించి కేంద్రప్రభుత్వానికి లేఖ పంపింది.



 ప్రమాణాల పెంపునకు ఎడ్యుకేషన్ క్లస్టర్లు

 ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్రంలో ఎడ్యుకేషన్ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో జరిగిన నాలెడ్జి మిషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక సంస్థల అవసరాలకు అనుగుణంగా వర్సిటీల్లో క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ద్వారా ఉన్నత విద్యను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు.



 నేడు ట్రిపుల్‌ఐటీ సీట్ల కేటాయింపు

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య సోమవారం విభిజించిన సంగతి తెలిసిందే. ఈ వర్సిటీ పరిధిలో ఏపీలో ఉన్న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ, కృష్ణాజిల్లా నూజివీడులలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలను బుధవారం ఖరారు చేయనున్నారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేయనున్నారని వర్సిటీవర్గాలు పేర్కొన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top