అక్రమాలకు సైఖతం !

అక్రమాలకు సైఖతం ! - Sakshi


 అక్రమార్కులు ఇసుక నుంచి రూ. లక్షలు పిండుకుంటున్నారు. ఇప్పుడు రీచ్‌లు వారికి అడ్డాలుగా మారాయి. అడ్డూఅదుపూ లేకుండా లారీలతో తరలించేస్తున్నారు. రాత్రి పూట తవ్వకాలు జరపరాదని నిబంధన ఉన్నా, పట్టించుకోకుండా చీకటి మాటున ఇష్టారాజ్యంగా ఇసుకను రవాణా చేస్తున్నారు.

 

 సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఇసుక రీచ్‌లు అక్రమార్కులకు వరంగా మారాయి. పలువురు అధికార పార్టీ నాయకులు ఇసుకపై దృష్టి పెట్టారు. చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని దర్జాగా దోచుకుంటున్నారు. రోజుల వ్యవధిలో అడ్డగోలుగా లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు. చీకటి పడితే చాలు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.   

 

  ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు జరిపి, రవాణా చేయాలి.

  రాత్రిపూట తవ్వకాలు, రవాణా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.  ఏ రోజు వే బిల్లు ఆరోజే వినియోగించుకోవాలి. అందుకు తగ్గట్టుగానే రీచ్ నిర్వాహకులు  వే బిల్లులు ఇవ్వాలి.  రీచ్‌కు, ఇసుక కావల్సిన వ్యక్తి ప్రాంతం మధ్య ఉన్న  దూరాన్ని బట్టి గడువు, సమయం నిర్ధేశించి వే బిల్లు జారీ చేయాలి.  రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రాక్టర్ల ద్వారానే రీచ్ నుంచి ఇసుక రవాణా చేయాలి. లారీలకు ప్రవేశమే లేదు.  అక్రమ రవాణా అరికట్టేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయి ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఇవీ ఇసుక రవాణాకు రాష్ట్రప్రభుత్వం విధించిన నిబంధనలు. అయితే జిల్లాలో ప్రారంభమైన ఏడు ఇసుక రీచ్‌లలో పైన పేర్కొన్న వాటిలో ఏ ఒక్క నిబంధన పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు.

 

 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకే తవ్వకాలు జరపాలని  అధికారులు చెబుతున్నా రాత్రిపూట కూడా యథేచ్ఛగా తవ్వకాలు జరిగిపోతున్నాయి. రీచ్‌ల నిర్వాహకులైన మేక్ సొసైటీ ప్రతినిధులను అడిగితే పగలైతే తాము చూడగలమని, మహిళలైన మేము  రాత్రిపూట ఏం చే యగలమంటున్నారు.  రాత్రిపూట రీచ్‌ల వద్ద పర్యవేక్షణ లేదనడానికి వీరి వ్యాఖ్యలే ఉదాహరణ.   ఇటు విజయనగరం-పార్వతీపురం, అటు విజయన గరం- పాలకొండ రహదారులో రాత్రి ఏడు గంటలు దాటితే చాలు ఇసుక తరలించే ట్రాక్టర్లు క్యూ కడుతున్నాయి. ఇక లారీలకు ప్రవేశం లేదన్న నిబంధ నలు స్పష్టంగా ఉన్నా పలు ఇసుక రీచ్‌ల నుంచి దర్జాగా లారీలతోనే రవాణా చేస్తున్నారు.

 

 ఇందుకు ఉదాహరణ నెల్లిమర్ల పోలీసులకు మంగళవారం ప ట్టుబడ్డ రెండు లారీలనే తీసుకోవచ్చు. డీడీ లేదా మీసేవలో సొమ్ము జమ చేసిన రోజునే వినియోగదారునికి ఇసుక సరఫరా చేసేలా రీచ్‌ల వద్ద వే బిల్లు లు జారీ చేయాలి. రీచ్‌కు, వినియోగదారుడి నివాస ప్రాంతానికి మధ్య ఉన్న దూరాన్ని బట్టి ఫలానా సమయంలోగా రవాణా చేయాలంటూ వే బిల్లులో స్పష్టంగా పేర్కొనాలి. కానీ ఆ ప్రకారం ఎక్కడా  జరగడం లేదు. ఒకే వే బిల్లుతో లెక్కకు మించి లోడ్‌లు తరలిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికంత టికీ వే బిల్లులో పేర్కొన్నట్టుగా రోజు, సమయం ప్రకారం  ఇసుక రవాణా జరగకపోవడమే కారణమని తెలుస్తోంది. దీంట్లో తిలాపాపం- తలాపాపం పిడికెడు అన్నట్టు అనేక మంది భాగస్వామ్యులవుతున్నారు.

 

 ఇదంతా ఒక ఎత్తు అయితే రీచ్‌ల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రాక్టర్ల ద్వారానే ఇసుక సరఫరా చేస్తామని అధికారులు చెప్పారు. అయితే, ఆ స్థాయిలో ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లు జరగలేదు. చాలా రీచ్‌లలో ఇసుక సరఫరా చేసేందుకు ట్రాక్టర్ల కొరత వెంటాడుతోంది. దీంతో వినియోగదారులు నేరుగా ట్రాక్టర్లు పట్టుకెళ్లి ఇసుక రవాణా చేసుకోవల్సి వస్తోంది. ఈ సమయంలో కొంతమంది అక్రమార్కులు రంగ ప్రవేశం చేసి, అధికార జులుం ప్రదర్శించి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఇటీవల ఒక రీచ్‌కు ఒక వినియోగదారుడు వెళ్లితే డీడీ తీయడం, మీసేవలో కట్టడమెందుకుని  తాము చెప్పిన నాయకుడు వద్దకెళ్లితే వెంటనే పనిఅయిపోతుందని, ఇంటికి నేరుగా ఇసుక వచ్చేస్తుందని స్థానికులు చెప్పారు. దీంతో ఆయన అవాక్కయ్యారు.  విశేషమేమిటంటే ఆ వ్యక్తి అధికార పార్టీకి చెందినవారే. తమకే ఇలా జరిగితే మిగతా వారి పరిస్థితేంటని వాపోయారు.  దీనికంతటికీ నిఘా, పర్యవేక్షణ లేకపోవడమే కారణంగా తెలుస్తోంది.

 

 కమిటీలేవి...

 నిబంధనల మేరకైతే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీలు వేయాలి.  ఇసుక మైనింగ్ కమిటీ కన్వీనరైన జిల్లా పంచాయతీ అధికారి ఈ కమిటీలను ఏర్పాటు చేయాలి.  ఈ కమిటీలే  అక్రమ తవ్వకాలు, రవాణా నియంత్రించాలి. అయితే, జిల్లాలో ఇంతవరకు ఎక్కడా ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీలను వేయలేదు. గ్రామ, మండల,జిల్లా స్థాయిలో పర్యవేక్షణే లేని పరిస్థితి నెలకొంది. దీంతో అక్రమార్కులకు అడ్డుఆపూలేకుండా పోతోంది. ఇక, పోలీసులు ఫిర్యాదులు, సమాచారం వస్తే తప్ప అక్రమ రవాణాపై దృష్టి సారించడం లేదు. ఒకటి రెండు చోట్ల  దృష్టిసారించినా పలువురు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారికంగా ప్రారంభించిన రీచ్‌ల్లోనే ఇలా ఉందంటే ప్రారంభించని చోట్ల ఇంకెంత స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top