మాటలు చాలు.. నిధులివ్వండి

మాటలు చాలు..  నిధులివ్వండి


ఉరవకొండ నుంచి సాక్షిప్రతినిధి : హంద్రీ-నీవాను పూర్తి చేసి, వంద టీఎంసీల నికర జలాలు కేటాయించి కష్టకాలంలోనైనా ‘సీమ’ రైతాంగానికి దన్నుగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించిన 25 గంటల నిరసన దీక్ష తొలిరోజు బుధవారం విజయవంత ంగా సాగింది. జిల్లా నుంచే కాకుండా ‘సీమ’ జిల్లాల నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, వ్యవసాయ, రైతుసంఘాల ప్రతినిధులు, పలు కుల, ప్రజా సంఘాల నేతలు భారీగా తరలివచ్చారు.



జిల్లా నలుమూలల నుంచి రైతులు, ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తరలివచ్చారు. హంద్రీ-నీవాపై గతంలో టీడీపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ఎండగడుతూ, ప్రాజెక్టు నిర్మాణానికి పాటుపడిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కీర్తిస్తూ...ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న మరో మోసాన్ని ఎత్తిచూపుతూ నేతల ప్రసంగాలు సాగాయి. హంద్రీ-నీవాను పూర్తి చేసేందుకు బడ్జెట్‌లో వెయ్యికోట్ల రూపాయలను కేటాయించి పనులను పూర్తి చేసి, ఈ ఖరీఫ్ నుంచే సాగునీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



ఉరవకొండ పాతబస్టాండ్‌లో బుధవారం 25 గంటల దీక్షకు దిగారు. తొలుత ర్యాలీగా వచ్చిన విశ్వ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డితో కలిసి పాలభిషేకం చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. పుంగనూరు ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విశ్వకు పూలమాల వేసి దీక్ష ప్రారంభింపజేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అధ్యక్షతన సభ సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు.‘రాయలసీమకు కృష్ణా జలాలను మళ్లించాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం.



ఫలితం లేదు.  వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాతే అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవాపై ఆశలు రేకెత్తాయి. రైతుల కష్టాలు తెలిసిన వారు కాబట్టే ముఖ్యమంత్రి అయిన మూన్నెళ్లలో టెండర్లు పిలిచి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. ప్రస్తుతం నీళ్లయితే కాలువల్లో కన్పిస్తున్నాయి. ఆనందంగా ఉంది. అయితే ఉప కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో నీళ్లున్నా ప్రయోజనం లేదు. పైగా ఎత్తిపోతల ద్వారా వచ్చిన ఈ 13 టీఎంసీల నీరు ఎంతో విలువైనవి. వీటితో 1.30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించొచ్చు. కానీ ప్రభుత్వం, నీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళిక లేకుండా వ్యవహరించారు.



ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ బడ్జెట్‌లో వందకోట్లు మాత్రమే కేటాయించారు. దీంతో ఎలా ప్రాజెక్టును పూర్తి చేస్తారో చంద్రబాబు చెప్పాలి. రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జిల్లాలో కూడా భారీగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో రైతాంగాన్ని ఆదుకోవల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. అయితే చంద్రబాబు మాత్రం ఇటీవల శ్వేతపత్రం విడుదల చేశారు. హంద్రీ-నీవాను ఓ అనాలోచిత ప్రాజెక్టుకు పేర్కొన్నారు. ప్రాజెక్టుకు అయిన వ్యయం మేర అరుునా రైతులకు ఆదాయం రాదని వ్యంగంగా మాట్లాడారు. 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపించారు.



ఎన్‌టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఇక్కడ ఆశ్రయం ఇచ్చారు. ఇలాంటి జిల్లాపై ఆయనకు ఏపాటి బాధ్యత ఉందో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతుంది. పైగా వైఎస్ కష్టంతో మూడేళ్లుగా వస్తున్న కృష్ణా జలాలను కొత్తగా ఈ ఏడాదే వీళ్లే తెచ్చినట్లుగా టీడీపీ నేతలు కాలువల్లోకి దిగి గంగమ్మ పూజలు చేస్తున్నారు. కొంచమైనా వీరికి సిగ్గుందా.. అని అడుగుతున్నా! ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదంటే డబ్బుల్లేవంటున్నారు.



మరి కోస్తాలో 1300 కోట్ల రూపాయలతో పట్టిసీమను ఎలా నిర్మిస్తున్నారు? సీమలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందంటే వెయ్యికోట్లు ఇవ్వలేరా?  జిల్లాలో ఐఐటీ, సెంట్రల్ యూనివర్శిటీ, ఏయిమ్స్ నిర్మిస్తానంటున్నావు.. ఢిల్లీకి వెళ్లి జీతాల్లేవంటావు. ఎన్నిరోజులు ఇలా ప్రజలను మోసం చేస్తావు.. ఆడబిడ్డల మెడలో బంగారు తాడు కూడా లేదు. నువ్వు చెప్పిన రుణమాఫీతో అందరూ మోసపోయారు. ఈ ఖరీఫ్‌లో సాగునీరు అందించాలి. ప్రభుత్వం కళ్లు తెరిపించడం కోసమే 25 గంటల దీక్షకు దిగాను’ అని విశ్వేశ్వరరెడ్డి అన్నారు.

 

కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట చౌదరి, రాష్ట్ర కార్యదర్శి, సీపీ వీర న్న జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మైనుద్దీన్, ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొర్రపాటి హుస్సేన్‌పీరా, ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి జయరాంనాయక్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబోలేశు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి చింతా సోమశేఖరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండిపరశురాం, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరేంద్రరెడ్డి,  పార్టీ రాష్ట్ర కార్యద ర్శులు నదీమ్ అహ్మద్, మీసాల రంగన్న, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి,



జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు సాలోన్‌బాషా, యువజనవిభాగం జిల్లా అధ్యక్షుడు ధనుంజయ్ యాదవ్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పామిడి వీరాంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి వైటీ గోవర్దన్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి,  రాష్ట్ర కార్యదర్శులు ఆలమూరు రాజీవ్‌రెడ్డి, కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగారెడ్డి. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ, రాష్ట్ర కార్యదర్శి శ్రీదేవి, జిల్లా కార్యదర్శి అంకిరెడ్డి ప్రమీల జిల్లా కార్యదర్శి, సూర్యనారాయణరెడ్డి,  యువజనవిభాగం నగర అధ్యక్షుడు మారుతీ నాయుడు, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు రిలాక్స్ నాగరాజు, వలిపిరెడ్డి శివారెడ్డి, రాప్తాడు జెడ్పీటీసీ రవీంద్రారెడ్డి, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.  

 

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కష్ణా జలాల కోసం నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్యతో పాటు చాలా మంది ముఖ్యమంత్రుల హయాంలో దశాబ్దాలుగా ఉద్యమాలు చేసినా ఫలితం లేదన్నారు. వైఎస్ సీఎం అయిన తర్వాతే బహత్తర ప్రాజెక్టు సాధ్యమైందన్నారు. వైఎస్ హయాంలో రూ.3,600 కోట్లు ఖర్చు చేశామని, ఆయన చనిపోయిన తర్వాత రోశయ్య, కిరణ్‌పై ఒత్తిడి తెచ్చి మరో రూ.2,140 కోట్లు రాబట్టామని తెలిపారు. ఫలితంగా మూడేళ్లుగా నీళ్లు వస్తున్నాయన్నారు.



ఇప్పుడు తామేదో నీళ్లు తెచ్చినట్లు టీడీపీ నేతలు నీళ్లలోకి దిగి ఫొటోలకు ఫోజులివ్వడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు జరిగిన రహస్య ఒప్పందంతోనే చంద్రబాబు విజయవాడలో రాజధాని నిర్మిస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. హంద్రీ-నీవా పూర్తి చేస్తే రాయలసీమ ప్రజల దప్పిక తీరడంతో పాటు వ్యవసాయానికి ప్రాణం వస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.



కొత్త ప్రాజెక్టులు ఎలాగూ చంద్రబాబు నిర్మించలేరని, కనీసం చివరి దశలోని హంద్రీ-నీవాను పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సూచించారు. సభలో ఎమ్మెల్యేలు అత్తార్ చాంద్‌బాషా, జయరాం, ఐజయ్య, మణిగాంధీ, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పత్తికొండ సమన్వయకర్త రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వై. మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top