రుణమాఫీకి టీడీపీ టోపీ!


  • మాటల్లో తప్ప చేతల్లో పొంతనేది?

  •  ముంగిట్లో వేలాడుతున్న  వేలం నోటీసులు

  •  లబోదిబోమంటున్న రైతులు

  •  దయచూపని బ్యాంకర్లు

  • వీరులపాడు : రుణమాఫీ మాటల్లో తప్ప చేతల్లో కనబడడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికలకు ముందు బంగారం బ్యాంకులో నుంచి తీసి చెల్లెమ్మల మెడలో వేస్తామని, తమ్మూళ్లూ రుణాలు చెల్లించొద్దని, మీ అప్పులన్నీ మాఫీ చేసి మిమ్మల్ని లక్షాధికారులను చేసేవరకు నిద్రపోనని  హామీలిచ్చిన చంద్రబాబు గెలిచిన తరువాత మొహం చాటేశారనిధ్వజమెత్తుతున్నారు. మహిళల మెడలో చంద్రబాబు బంగారం వేయడం ఏమో కానీ... బ్యాంక్ అధికారులు మాత్రం వేలం నోటీసులు  ఇళ్లకు తగిలిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.



    కాగా  వాయిదా మీరిన వ్యవసాయ బంగారు రుణాలు రైతులు చెల్లించలేకపోవడంతో రుణమాఫీ ఎప్పటికి అమలవుతుందో అర్థంకాని బ్యాంకర్లు తమ ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.  వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో   ఇండియన్ బ్యాంక్ నుంచి  బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులకు అధికారులు  వేలం నోటీసులు పంపిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో రైతుల రుణాలను పూర్తిగా మాఫీచేసే బాధ్యత మాదేనని చెప్పిన తెలుగుదేశం నాయకులు  ఇప్పడు కంటికి కనిపించడంలేదని రైతులు వాపోతున్నారు. బ్యాంకుల నుంచి వస్తున్న వేలం నోటీసులు తీసుకుని రైతులు బ్యాంక్ అధికారుల వద్దకు వెళ్లి ప్రస్తుతం రుణాలు చెల్లించే  పరిస్థితుల్లో లేమని, వేలాన్ని నిలుపుదల చేయాలని కోరుతున్నారు.



    వ్యవసాయ పెట్టుబడుల సమయంలో బంగారం ఆభరణాలు వేలానికి రావడంతో   ఆందోళన చెందుతున్నారు. వడ్డీలు చెల్లించైనా సరే వేలాన్ని నిలుపుదల చేద్దామన్నా... చేతిలో చిల్లిగవ్వ అయినా లేదని బ్యాంక్ అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు చంద్రబాబు ఆశ పెట్టిన రుణమాఫీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జుజ్జూరు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ బివి.సత్యనారయణను వేలం నోటీసులపై వివరణ కోరగా.... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వాయిదా మీరిన పంట, ఆభరణ రుణాలను వేలం వేసేందుకు  నోటీసులు అందిస్తున్నామని తెలిపారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top