హంద్రీ-నీవా పనులకు కొత్త టెండర్లు

హంద్రీ-నీవా పనులకు కొత్త టెండర్లు


- రూ.39.87కోట్ల పనులకు రూ.160కోట్ల అంచనా

- రద్దుచేసిన 14, 31 ప్యాకేజీలు  

- 6, 10, 15 ప్యాకేజీల్లో అసంపూర్తి పనులు రూ.39.87కోట్లు

- వీటి టెండర్లకు సిద్ధమవుతున్న సర్కారు

బి.కొత్తకోట:
హంద్రీ-నీవా సాగునీటి ప్రాజెక్టు రెండో దశలో ప్రభుత్వం రద్దుచేసిన రెండు ప్యాకేజీలు, అసంపూర్తిగా ఆగిపోయిన మరో రెండు ప్యాకేజీల్లోని పనులను అప్పగించేందుకు ప్రభుత్వం కొత్తగా టెండర్లకు సిద్ధమవుతోంది. కాంట్రాక్టర్లు చేసుకున్న ఒప్పందంలో రూ.39.87కోట్ల అసంపూర్తి పనులు పెండింగ్‌లో ఉండగా, వీటికి రూ.160కోట్లతో కొత్తగా టెండర్లు నిర్వహించేందుకు చర్యలు మొదలయ్యాయి. చిత్తూరు జిల్లాలోని 31వ ప్యాకేజీలో అసంపూర్తి పనులను ఓ సంస్థకు అప్పగించారు.



మదనపల్లె సర్కిల్ పరిధిలోని అనంతపురం జిల్లాలో 14వ ప్యాకేజీకి చెందిన ప్రధానకాలువ, చిత్తూరు జిల్లాలో 31వ ప్యాకేజీ వాల్మీకిపురం కాలువ పనులను దక్కించుకున్న ల్యాంకో ఇన్‌ఫ్రా సంస్థ పనులు పూర్తి చేయకపోవడంతో గురువారం సంస్థను పనుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. శ్రీఅవంతిక-సాయివెంకట సంస్థ అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రాంతంలోని 6, 10 ప్యాకేజీలు, కదిరి ప్రాంతంలోని 15వ ప్యాకేజీల్లో పనులు అసంపూర్తిగా నిలిపివేయడంతో కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం 5 ప్యాకేజీలకు టెండర్లు నిర్వహించాల్సి ఉండగా, నాలుగింటికి భారీ అంచనాలతో ఒకట్రెండు రోజుల్లో నిర్ణయించనున్నారు.

 

అసంపూర్తి పనులు రూ.39.87కోట్లు

టెండర్లు పిలవనున్న నాలుగు ప్యాకేజీల్లో అసంపూర్తిగా ఉన్న పనుల విలువ రూ.39.87కోట్లు. 14వ ప్యాకేజీ పనుల ఒప్పంద విలువ రూ.57.26కోట్లలో రూ.45.17కోట్ల పనులు జరిగాయి. 31వ ప్యాకేజీలో రూ.31.93కోట్ల పనుల్లో రూ.23.38కోట్ల పనులు పూర్తిచేశారు. 6వ ప్యాకేజీ విలువ రూ.32.4కోట్లలో రూ.26.14కోట్ల పనులు, 10వ ప్యాకేజీలో రూ.28.08కోట్ల పనుల్లో రూ.21.33కోట్ల పనులు, 15వ ప్యాకేజీలో రూ.27కోట్ల పనులకు రూ.20.78కోట్ల పనులు జరిగాయి. ఈ ప్యాకేజీల్లో రూ.176.67కోట్ల పనులకు రూ.136.8కోట్ల పనులు చేశారు. మిగిలినవి పనులు చేపట్టకపోవడంతో అసంపూర్తిగా ఆగిపోయాయి.

 

కొత్త అంచనాలు రూ.160కోట్లు!

6, 10,14, 15 ప్యాకేజీల పనులను కొత్తగా అప్పగించేందుకు అంచనాలు రూ.160కోట్లకు చేరుతున్నాయి. దీనిపై ప్రాజెక్టు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త ఎస్‌ఎస్‌ఆర్ పట్టికను జారీచేసింది. దీన్ని జూలై ఒకటి నుంచే వర్తింపజేయనున్నారు. దీంతో 6వ ప్యాకేజీ పనులకు రూ.30కోట్లు, 10వ ప్యాకేజీకి రూ.30కోట్లు, 14వ ప్యాకేజీకి రూ.70కోట్లు, 15వ ప్యాకేజీకి రూ.30కోట్ల అంచనాలను ప్రాథమికంగా సిద్ధం చేశారు. కొంత మార్పులతో ఖరారు చేయనున్నారు. 10రోజుల్లో టెండర్లు నిర్వహించేలా చర్యలు వేగవంతం చేశారు.



కాగా 14వ ప్యాకేజీలో  రూ.12.09కోట్ల అసంపూర్తి పనులకు ఏకంగా రూ.70కోట్లకు అంచనాలు పెంచుతున్నారు. 31వ ప్యాకేజీలో రూ.8.55కోట్ల పనులను పూర్తిచేసేందుకు ఆర్‌కేఇన్‌ఫ్రా సంస్థ ముందుకు రావడంతో పనులు ఆ సంస్థకు అప్పగించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. కొత్త టెండర్లపై మదనపల్లె సర్కిల్ ఎస్‌ఈ మురళీధర్‌రెడ్డి వివరణ కోరగా, పనులు అంచనాలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. 6, 10,14, 15 ప్యాకేజీల్లోని అసంపూర్తి పనులు, కుప్పం బ్రాంచ్‌కెనాల్ పనులకు ఒకేసారి టెండర్లకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top