రోడ్ల నిర్మాణానికి కొత్త టెక్నాలజీ


  •      కిలోమీటరుకు రూ.10 లక్షల ఖర్చు ఆదా

  •      ఏడాది పనులు ఆరు నెలలకే పూర్తి

  •      పెలైట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లా

  •      దీనిపై ఆగస్టు 7న విజయవాడలో ఇంజనీర్ల రాష్ట్ర స్థాయి సదస్సు

  • చిత్తూరు(టౌన్): రాష్ట్రంలో తారు రోడ్ల నిర్మాణానికి ఇకపై కొత్త టెక్నాల జీని అవలంబించనున్నారు. తద్వారా ఖర్చుతోపాటు సమయమూ ఆదా కానుంది. ప్రస్తుత టెక్నాలజీతో చేపట్టే పనులకు ఏడాది సమయం పడితే కొత్త టెక్నాలజీ ద్వారా ఆరు నెలలకే పూర్తిచేసే అవకాశముంది. పైగా కిలోమీటరు దూరానికి దాదాపు రూ.10 లక్షల వరకు ఆదా అవుతుందని పంచాయతీరాజ్ ఇంజనీర్లు గుర్తించారు. ఈ పద్ధతి కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే అమలులో ఉంది.



    పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ విభాగానికి చెందిన చిత్తూరు ఈఈ అమరనాథరెడ్డి, చౌడేపల్లి, తంబళ్లపల్లె డీఈఈలు చంద్రశేఖర్‌రెడ్డి, జ్యోతిరాములు నాలుగు రోజుల క్రితం తమ సిబ్బందితో కలసి వెళ్లి కర్ణాటక రాష్ట్రం చిక్‌బల్లాపూర్‌లో కొత్త టెక్నాలజీతో నిర్మించిన తారురోడ్డును పరిశీలించారు. సంబంధిత ఇంజనీర్లతో క్షుణ్ణంగా చర్చించి వచ్చారు. కొత్త టెక్నాలజీనే ఇకపై రాష్ట్రంలో అంచెలంచెలుగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై ఆగస్టు 7న విజయవాడలో రాష్ట్రస్థాయి ఇంజనీర్లు (ఈఎన్‌సీ స్థాయి అధికారులు) సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొననున్నారు.

     

    ప్రస్తుత టెక్నాలజీ ఇదీ..

     

    తారురోడ్ల నిర్మాణానికి ప్రస్తుతం అవలంబిస్తున్న టెక్నాలజీ వల్ల కిలోమీటరు దూరానికి రూ.50 లక్షలు ఖర్చవుతోంది. ముందుగా ఎర్త్‌వర్క్ చేసుకున్న తర్వాత గ్రావెల్ తోలడం, ఆ తర్వాత 150 ఎంఎంతో రెండు లేయర్లుగా మెటల్ వేసి రోలింగ్ చేసిన తర్వాత 25 ఎంఎంతో తారురోడ్డు నిర్మిస్తున్నారు. దీనికి కిలోమీటరు దూరానికి రూ.50 లక్షల ఖర్చుతో నెల రోజుల సమయం పడుతోంది.

     

    కొత్త టెక్నాలజీ ఎలాగంటే..

     

    కొత్త టెక్నాలజీతో తారు రోడ్డు నిర్మించేందుకు కిలోమీటరుకు రూ.40 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. ప్రస్తుత టెక్నాలజీతో పోల్చితే  కిలోమీటరుకు రూ.10 లక్షలు తగ్గుతుంది. కొత్త టెక్నాలజీలో ఎర్త్‌వర్కు, గ్రావెల్ వర్కు పాతదే అయినా రెండు లేయర్లుగా వేయాల్సిన మెటల్‌కు బదులు 12 ఎంఎం, 15 ఎంఎం, 40 ఎంఎం, 45 ఎంఎం మెటల్‌ను ఒకటిగా కలిపి వంద మిల్లీమీటర్ల ఎత్తు వచ్చే విధంగా నిర్మిస్తారు. దానిపై యథాతథంగా 25 ఎంఎం పరిమాణంతో తారు రోడ్డును నిర్మిస్తారు. రెండు లేయర్లు ఒకటిగానే కలిపి వేయడంతో ఖర్చుతోపాటు సమ యం కలిసొస్తుంది. నెల రోజులు సమయం పట్టే ఓ రోడ్డు నిర్మాణం 15 రోజుల్లోనే పూర్తవుతుంది.

     

    పెలైట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లా

     

    కొత్త టెక్నాలజీకి కేంద్రం నుంచి రూ.50 కోట్ల పనులకు అంగీకారం లభించినట్టు పంచాయతీరాజ్ ఇంజనీర్ ఒకరు చెప్పారు. ముందుగా చిత్తూరు జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. కేంద్రం మంజూరు చేసే రూ. 50 కోట్లను జిల్లాలో నూతనంగా నిర్మించే తారు రోడ్లకు కేటాయించనున్నారు. దీనికోసం పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ విభాగం ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

     

    జిల్లా రోడ్లకు మహర్దశ

     

    నిధుల లేమి కారణంగా ఇప్పటికే జిల్లాలో చేపట్టిన సుమారు రూ.300 కోట్ల పనులను ప్రభుత్వం నిలిపేసింది. రూ.500 కోట్ల పనులను పరోక్షంగా అడ్డుకుంటోంది. ఈ పరిస్థితిలో రూ.50 కోట్లతో కొత్తగా తారు రోడ్ల నిర్మాణాలకు గాను చిత్తూరు జిల్లాను కేంద్రం పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో ఆనందం వ్యక్తమవుతోంది.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top