కాకినాడకు కొత్త మాస్టర్‌ప్లాన్


కాకినాడ రూరల్ :కాకినాడ నగరానికి కొత్త మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. నగరానికి 1977లో రూపొందించిన మాస్టర్‌ప్లాన్ ఆధారంగా ఈ కొత్త ప్లాన్‌ను సిద్ధం చేశారు. కాకినాడ నగరం, దాని చుట్టుప్రక్కల 5 కిలోమీటర్ల మేర ఉన్న గ్రామాలను కలుపుతూ ఈ మాస్టర్ ప్లాన్ తయారైంది. ఆర్వీ అసోసియేట్స్ రూపొందించిన ఈ మాస్టర్‌ప్లాన్‌పై అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అవగాహన సదస్సును బుధవారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట స్పందన ఫంక్షన్‌హాలులో నిర్వహించారు. అసోసియేట్స్ ప్రతినిధుల బృందం ఈ మాస్టర్ ప్లాన్ వివరాలను తెలియజేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 3లక్షల 25వేల 985 మంది ఈ మాస్టర్ ప్లాన్ కిందకు వస్తారన్నారు.

 

 మొత్తం 76,376 గృహాలు ఉన్నాయని, 31.69 చదరపు కిలోమీటర్ల చుట్టుకొలత ఉన్న  కాకినాడ నగరంతో పాటు దాని చుట్టుప్రక్కల ఉన్న 34 గ్రామాలను నగరంలో కలుపుతూ ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌ను రూపొందించామని వివరించారు. దీనిలో కాకినాడ రూరల్, సామర్లకోట, తాళ్లరేవు, పెదపూడి మండలాలకు చెందిన 34 గ్రామాలను చేర్చినట్టు వివరించారు. ఈ ప్లాన్ ప్రకారం కాకినాడ నగరం, దాని చుట్టుప్రక్కల గ్రామాలతో కలిపి 161.83 చదరపు కిలోమీటర్లు వస్తుందన్నారు. గ్రామాల్లో ఉన్న రోడ్ల చుట్టుకొలతలతో సహా ప్లాన్ రూపొందడంతో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ప్రభుత్వ విప్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ఎంపీటీసీ సభ్యులు కర్రి సత్యనారాయణ, టిడిపి జిల్లా ప్రధానకార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, ఎంపీపీ పుల్ల సుధాచందు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మట్టా ప్రకాష్‌గౌడ్, పలువురు సర్పంచ్‌లు పలు సూచనలు చేశారు.

 

 పజాప్రతినిధులతో ముందుగానే మాట్లాడి ఉంటే మరింత సమాచారంతో ప్రత్యేక ప్లాన్ తయారై ఉండేదని అభిప్రాయపడ్డారు. అన్నీ రూపొందించిన తరువాత ఇదిగో ఇలా చేశాం, దీన్ని ఆమోదించడం మీ బాధ్యత అని చెప్పడం సబబుకాదని ఎమ్మెల్యే అనంతలక్ష్మి, విప్ చైతన్యరాజు అన్నారు. గ్రామాల వారీ ప్రజాప్రతినిధులు, మేధావులు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకొని మరింత సమర్ధవంతమైన మాస్టర్ ప్లానును తయారు చేయాలని ఎమ్మెల్యే అనంతలక్ష్మి సూచించారు. రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అధికారి రామకృష్ణారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ గోవిందస్వామి,  కార్పొరేషన్ ఈఈ రామిరెడ్డి, డిప్యూటీ సిటీప్లానర్ రాంబాబు, అసిస్టెంట్ ప్లానర్ పద్మాజీ, ఆర్వీ అసోసియేట్స్ ప్రతినిధులు రమేష్ తదితరులు మాస్టర్ ప్లాన్‌పై అవగాహన కల్పించారు.

 

 మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న గ్రామాలు

 రమణయ్యపేట, పి.వెంకటాపురం, పండూరు, తమ్మవరం, సూర్యారావుపేట, వలసపాకల, ఉప్పలంక, గురజనాపల్లి, చొల్లంగి, చొల్లంగిపేట, పెనుగుదురు, కొరుపల్లి, నడకుదురు, జెడ్ భావారం, అరట్లకట్ట, గొడ్డటిపాలెం, కొవ్వూరు, తూరంగి, కాకినాడ రెవెన్యూ, కాకినాడ మేడలైన్, ఇంద్రపాలెం, చీడిగ, కొవ్వాడ, రేపూరు, రామేశ్వరం, గంగనాపల్లి, స్వామినగర్, ఎస్ అచ్యుతాపురం, మాధవపట్నం, సర్పవరం, పనసపాడు, అచ్చంపేట, కొప్పవరం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top