హలో.. హాలో..


అధ్వానంగా బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్

 

బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేరండి, ప్రభుత్వ సంస్థను కాపాడండంటూ ఇస్తున్న ప్రకటనలు వినియోగదారులకు చుక్కలుచూపుతున్నాయి. పోటీ ప్రపంచంలో బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ పలు రాయితీలను ప్రవేశపెట్టి వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటే ఆ సంస్థలో పనిచేస్తున్న అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ అధ్వానంగా ఉందంటూ వినియోగదారులు గగ్గోలుపెడుతున్నా వారు సరిగా స్పందించడంలేదనే ఆరోపణలున్నాయి.



నెల్లూరు (రవాణా) : జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు తగ్గట్టుగా సెల్‌టవర్లు లేవు. దీంతో నెట్‌వర్క్ సరిగ్గా లేకపోవడం, ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించకపోవడం తదితర కారణాలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు చేసేదేమీలేక ప్రత్యామ్నాయం వైపు అడుగులేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.



ప్రైవేటుతో పోటీకి దూరం..

 జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు పలు ప్రైవేటు సంస్థలు వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. జిల్లాలో 12 నుంచి 14 లక్షల మంది మొబైల్ వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థలు మొబైల్ పరంగా గాకుండా ల్యాండ్‌ఫోన్, బ్రాండ్‌బాండ్ తదితర రంగాల్లో పోటీపడుతూ వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. పోటీ ప్రపంచంలో పలు రాయితీలు అందించడంతో పాటు వినియోగదారులకు అన్నివేళలా సేవలందించేందుకు అందుబాటులో ఉంటున్నాయి.



అయితే బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం అందుకు విరుద్ధంగా పనిచేస్తుంది. జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు అన్నిరంగాల్లో కలిపి 6,58,982 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో మొబైల్ రంగంలో 5,142 పోస్ట్‌పెయిడ్ ఉండగా, 5,91,211 ప్రీపెయిడ్ వినియోగదారులు ఉన్నారు. ల్యాండ్‌లైన్‌కు సంబంధించి 53,717 మంది, ఇంటర్నెట్ కనెక్షన్లు 14,054 మంది వినియోగదారులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మొబైల్, ఇంటర్నెట్ విభాగాల్లో సమస్యలు ఎక్కువుగా ఉన్నట్లు వినియోగదారులు అంటున్నారు.



టవర్ల కొరత

 ప్రధానంగా మొబైల్ నెట్‌వర్క్ అధ్వానంగా ఉంది. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ సరిగా అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్ పరంగా 2జీ, 3జీ వినియోగదారులు ఉన్నారు. నెట్‌వర్క్ వేగంగా ఉంటుందన్న కారణంగా ఎక్కువమంది వినియోగదారులు 3జీ కనెక్షన్‌ను తీసుకుంటున్నారు. కానీ నెట్‌వర్క్ విషయంలో 2జీ కంటే దారుణంగా ఉంటుందని పలువురు వాపోతున్నారు. జిల్లాలో మొత్తం 421 టవర్లు ఉన్నాయి.



వాటిలో 309 టవర్లు 2జీ, 112 టవర్లు 3జీ సేవలు అందిస్తున్నాయి. నగరంలోని నవాబుపేట, మూలాపేట, పొదలకూరురోడ్డు, బుజబుజనెల్లూరు, లేక్‌వ్యూకాలనీ తదితర ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ ఉండదని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాల్ వ చ్చిందంటే నెట్‌వర్క్ అందక వీధిలోకి వచ్చి మాట్లాడుకోవాల్సి వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మిద్దెపైకి ఎక్కి సెల్ మాట్లాడుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



ఇతర సంస్థలతో కుమ్మక్కు

 ఇతర నెట్‌వర్క్ సంస్థలతో కొంతమంది అధికారులు కుమ్మక్కై నెట్‌వర్క్‌ను సరిగా అందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్రీక్వెన్సీ విషయంలో అధికారులు సరిగా పట్టించుకోకపోవడం, కొన్ని సమయాల్లో ఫ్రీక్వెన్సీని తగ్గించడం వంటివి చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.



2జీ నెట్‌వర్క్‌కు 900 నుంచి 1,800లు, 3జీ నెట్‌వర్క్‌కు 900 నుంచి 2,100 వాట్స్ ఫ్రీక్వెన్సీ టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అన్ని సంస్థల టవర్లు ఇదే స్థాయిలో ఉన్నా ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సేవలందిస్తున్నారు. అదేవిధంగా బిల్లులు విషయంలో, నెట్‌వర్క్ విషయంలో అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలున్నాయి.



నెట్‌వర్క్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి: -వెంకటనారాయణ, బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం

 బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్య ఉంది. అందుకోసం నగరంలో తొమ్మిదిప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. టవర్లును నిర్మించేందుకు కొంతమంది భవన యజమానులు ముందుకు రావాలి. వారికి టవర్ ఏర్పాటుకు నెలవారీ కొంతమొత్తాన్ని అద్దెరూపంలో ఇస్తాం. త్వరలో నెట్‌వర్క్ సమస్య లేకుండా చేస్తాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top