‘నెట్టింటి’ పాలన !


ఏలూరు సిటీ : జిల్లాలో ఎలక్ట్రానిక్ పాలనకు రంగం సిద్ధం చేస్తున్నారు. ‘ఈ-ముద్ర’ పేరుతో దీనిని అమలు చేయనున్నారు. తద్వారా పరిపాలన అంతా ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే జిల్లాస్థాయి అధికారి నుంచి అటెం డర్ స్థాయి వరకూ అందరికీ యూజర్ ఐడీ నంబర్లు ఇస్తారు. వాటి ఆధారంగా ఆయా శాఖలకు సంబంధించిన ఫైళ్లను ఆన్‌లైన్‌లోనే పరిష్కరిస్తారు. సింగపూర్ తరహాలో ‘ఈ-ముద్ర’ అమలుకు కలెక్టర్ కె.భాస్కర్ కసరత్తు చేస్తున్నారు.

 

జవాబుదారీ ఉంటుందని..

ఈ విధానం వల్ల అధికారులు, సిబ్బందిలో జవాబుదారీ తనం పెరుగుతుందని యంత్రాం గం అభిప్రాయపడుతోంది. కలెక్టరేట్ మొదలు డీఆర్‌వో, ఆర్డీవో, పోలీస్, జెడ్పీ, ఆరోగ్యశ్రీ, విద్యాశాఖ, ఎస్‌ఎస్‌ఏ, డీఆర్‌డీఏ, డ్వామా, రిజి స్ట్రేషన్స్, పరిశ్రమలు, హేండ్లూమ్స్, సోషల్ ఫారెస్ట్, సీటీవో, అగ్నిమాపక, సెట్‌వెల్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్, ఫిషరీస్, ట్రెజరీ, డెయిరీ, డీటీసీ, డీఎంహెచ్‌వో, ప్రభుత్వాసుపత్రి, దేవాదాయ, ఆర్టీసీ, సివిల్ సప్లైస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, రోడ్లు-భవనాలు, పొల్యుషన్, ఎక్సైజ్, మునిసిపాలిటీ తదితర శాఖలు 90 వరకు ఉన్నాయి. వీటిలో అధికారులు, ఉద్యోగులు కలిపి సుమారు 35 వేల మంది పని చేస్తున్నారు. వీరందరికీ యూజర్ ఐడీ నంబర్లు ఇస్తారు. దీనివల్ల పాలనలో పారదర్శకత పెరుగుతుందని, ఫైళ్లను మార్పులు చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని అంటున్నారు.

 

నిర్వహణ సాధ్యమేనా

ఈ ముద్రతో ప్రజలకు మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, ప్రభుత్వ శాఖలకు ఆ స్థాయిలో నిపుణులు, కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చాల్సి ఉంటుంది. చాలా శాఖల్లో ఇప్పటికీ పాత కాలం నాటి కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్లు, ఇతర మెటీరియల్‌ను సమకూర్చడానికి భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఉద్యోగుల జీతాలకే ట్రెజరీ నుంచి బిల్లులు మంజూరు కాని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ‘ఈ-ముద్ర’కు అవసరమైన నిధులు ఎలా సమకూరుస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఏదో రకంగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చినా దాని నిర్వహణకు నిధులు ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top