వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి - Sakshi


బిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే కన్నుమూత

వైద్యులు, సిబ్బందిపై మృతురాలి భర్త ఆగ్రహం

 

 కూచిపూడి (మర్రిపూడి) : రిమ్స్‌లో ఓ బాలింతకు సకాలంలో వైద్యం అందకపోవడంతో పరిస్థితి విషమించి మృతి చెందింది. తల్లి పొత్తిళ్లలో సేద తీరాల్సిన ఆ శిశువు మాతృమూర్తి ప్రేమ కోల్పోయింది. రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి భర్త కన్నీటిపర్యంతమయ్యాడు. బంధువుల కథనం ప్రకారం.. మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామానికి చెందిన పందిటి గోవిందమ్మ(25) 9 నెలల గర్భిణి. రెండో కాన్పు కోసం బంధువులు, భర్త రిమ్స్‌లో చేర్పించారు. 18 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కాన్పు సమయం వచ్చినప్పుడు గోవిందమ్మ కాళ్లకు నీరు చేరింది.



వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు సాధారణ కాన్పు కష్టమని తేల్చారు. ఆపరేషన్ చేసేందుకు బంధువులు అంగీకరించారు. ఆ మేరకు బుధవారం ఆపరేషన్ చేశారు. గోవిందమ్మ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో అంతా ఆనందించారు. ఇద్దరికీ ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇంతలో తల్లికి రక్తం తక్కువగా ఉందని, ఓ- నెగిటివ్ రక్తాన్ని ఎక్కిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు చెప్పారు. గోవిందమ్మ సోదరుడు నారాయణదీ అదే గ్రూపు రక్తం కావడంతో ఎక్కించారు. సరిపోకపోవడంతో మరో బాటిల్ రక్తం కోసం ఒంగోలులో పలుచోట్ల తిరిగి సాధించారు.



అది ఎక్కించిన బాలింత పరిస్థితి బాగులేదని, బీపీ ఎక్కువగా ఉందని, త్వరగా గుంటూరు తీసుకెళ్లాలంటూ వైద్యులు ఒత్తిడి చేయడంతో గోవిందమ్మ భర్త, బంధువులు ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకూ ఇబ్బంది లేదని చెప్పి మళ్లీ పరిస్థితి విషమంగా ఉందని చెప్పడం ఏంటని వైద్యులు, సిబ్బందిని ప్రశ్నించారు. గుంటూరు వెళ్లేంత సమయం లేకపోవడంతో దగ్గరలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లిన కొద్దిసేపటికే గోవిందమ్మ ప్రాణాలు కోల్పోయింది. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం కూచిపూడి తరలించారు. విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని భోరున విలపించారు.  పెద్ద కుమార్తె నాగేంద్ర తల్లి శవంపై పడి వెక్కివెక్కి ఏడుస్తున్న దృశ్యం పలువురిని కలచి వేసింది.  



  పసికందు ఆకలి కేకలు

 ఓ వైపు తల్లి చనిపోయింది. తండ్రి దుఃఖసాగరంలో మునిగిపోయాడు. పెద్ద కుమార్తె అమ్మా.. లేమ్మా.. అంటూ విలపిస్తోంది. మరో పక్క అప్పుడే పుట్టిన పసికందు ఆకలి కేకలు.. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికుల కళ్లు చెమ్మగిల్లాయి.  

 

 రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యమే

 మీ భార్యకు ఇబ్బంది లేదని, ఎలాంటి భయం అవసరం లేదని రిమ్స్ వైద్యులు చెప్పారు. గురువారం తెల్లవారు జామున పేషెంట్‌ను అర్జెంట్‌గా గుంటూరు తీసుకెళ్లమని చెప్పారు. నన్ను రక్తం కోసం పంపారు. ఎన్ని చోట్ల తిరిగినా ఓ నెగెటివ్ రక్తం దొరకలేదు. ముందే చెప్పి ఉంటే వేరే వైద్యశాలకు తీసుకెళ్లి నా భార్యను బతికించుకునేవాడిని. అప్పడికప్పుడు చెప్పడంతో ఏం చేయాలో తోచక దగ్గర్లో ఉన్న సంఘమిత్ర వైద్యశాలకు తీసికెళ్లిన రెండు నిమిషాల్లో ప్రాణం పోయింది. ఇది కేవలం రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యమే. వారి కారణంగానే నా భార్య గోవిందమ్మ మృతి చెందింది.  

 -పోలయ్య, మృతురాలి భర్త

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top