అటకెక్కిన డ్వాక్రా రుణమాఫీ

అటకెక్కిన డ్వాక్రా రుణమాఫీ - Sakshi


నెల్లూరు: నెల్లూరు జిల్లాలో డ్వాక్రా మహిళల పరిస్థితి అయోమయంగా తయారైంది. వాయిదాల భారం ఒక్కసారిగా మీదపడటంతో అప్పులపాలై అల్లాడుతున్నారు. చంద్రబాబు అధికారం చేపట్టి ఏడునెలలు గడిచిపోయినా.. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. దీంతో డ్వాక్రా మహిళలు కొందరు రుణాలు చెల్లించలేక.. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోలేక వారి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. మరికొందరు బ్యాంకర్లు ఒత్తిడి చేయటంతో.. చేసేది లేక రుణాలు, వడ్డీ మొత్తం చెల్లిస్తుండటం గమనార్హం. నెల్లూరు జిల్లాలో సుమారు 35,565 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వివిధ బ్యాంకుల నుంచి రూ.592.28 కోట్లు రుణాలు తీసుకున్నారు. 2013-14లో 8,690 సంఘాలకు సుమారు రూ. 200 కోట్లు తీసుకున్నారు. గతంలో బ్యాంకు లింకేజీ, స్వయం ఉపాధి కింద రూ. 236 కోట్లు పొందారు.




నెల్లూరులో 4120 గ్రూపులకు రూ. 40 కోట్లు రుణాలు తీసుకుని ఉన్నారు. చంద్రబాబు 'అక్కచెల్లెమ్మలు ఎవ్వరూ తీసుకున్న రుణాలు కట్టొద్దు. నేనొస్తాను. మీ బాకాలన్నీ కట్టేస్తాను. నన్ను నమ్మండి' అని ప్రతి బహిరంగ సభల్లో హామీలు గుప్పించారు. బాబు మాటలు నమ్మిన జనం ఆయనకు ఓట్లేసి.. రుణాలకు సంబంధించి వడ్డీ కూడా కట్టకుండా నిలిపేశారు. కానీ బ్యాంకు అధికారులు గ్రామాల్లో తిరుగుతూ సమావేశాలు పెడుతున్నా రు. అసలు, వడ్డీ చెల్లించకపోతే  గ్రూపు గుర్తింపును రద్దుచేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది కదా అని చెప్పినా.. అప్పులు కట్టాల్సిందేనని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నట్లు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



అసలుకు వడ్డీ భారం..

నెల్లూరు నగరంలో ఓ మహిళా సంక్షేమ సంఘంలో 20 మంది సభ్యులు బ్యాంకు నుంచి రూ. 3లక్షలు రుణం తీసుకున్నారు. ఇప్పుడు ఆరు నెలలు బకాయిపడడంతో  నెల వాయిదా రూ. 15వేల చొప్పున రూ.90వేలు, నెలకు రూ. 5వేలు వడ్డీ చొప్పున కట్టాలని బ్యాంకు అధికారులు లెక్కలు చెపుతున్నట్లు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకపోతే పావలా వడ్డీ వర్తించదని, పూర్తి వడ్డీ చెల్లించాల్సిందేనని తేల్చిచెపుతున్నారు. అసలు, వడ్డీ చెల్లించకపోతే డిఫాల్టర్లుగా చేస్తామని హెచ్చరిస్తున్నట్లు మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలాఉంటే 2014-2015కి జిల్లాలోని డ్వాక్రా సభ్యులకు రూ.665 కోట్లు ఇవ్వాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. అయితే రుణమాఫీ ప్రకటనతో డ్వాక్రా సభ్యులు అస లు, వడ్డీ చెల్లించకపోవటంతో బ్యాంకర్లు కూడా రుణాలు ఇవ్వలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top