యూపీఏను అనుసరిస్తున్న ఎన్‌డీఏ


ఆత్మకూరు రూరల్:   ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం గత యూపీఏ అవలంబించిన విధానాలను అనుసరిస్తుందని సీపీఎం  రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్ ఆరోపించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ హాల్‌లో ఆదివారం కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  బీజేపీ అధికారంలోకి వస్తే మార్పు వస్తుందని, అందుకోసం తమను గెలిపించాలని మోడీ  ప్రచారం చేశారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాలనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు.

 

పార్లమెంట్ సమావేశాల కంటే ముందే రైల్వే చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. ప్రభుత్వ సంస్థలైన ఎల్‌ఐసీ, బ్యాంకింగ్ రంగాల్లో 49 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించారని మండిపడ్డారు. రైల్వేను ప్రైవేటు పరం చేసి ఉద్యోగ కార్మికులకు నష్టం కలిగించే చర్యలు ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రయివేటు, పారిశ్రామివేత్తలకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. పేదల, నిరుద్యోగుల సంక్షేమం కోసం, కొత్త ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు.

 

అనంతరం సీపీఎం డివిజన్ కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాల అమలుకు బడ్జెట్‌లో నిధలు కేటాయించలేదని విమర్శించారు.  సీపీఎం డివిజన్ కార్యవర్గ సభ్యులు  ఏసురత్నం, స్వాములు, రణధీర్, డివిజన్ కమిటీ సభ్యులు రజాక్, రాందాసు, నరసింహానాయక్, పుల్లమ్మబాయి, రామచంద్రుడు, మహిళా సంఘం నాయకురాళ్లు మంజుల, మణెమ్మ, అక్కమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాజేష్, ఓంకార్, జయచంద్ర, రైతుసంఘం నాయకులు సామన్న తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top