నాయుడుగూడేన్ని వైఫైగామారుస్తా..

నాయుడుగూడేన్ని వైఫైగామారుస్తా..


నాయుడుగూడెం (పెదపాడు) : పెదపాడు మండలంలోని నాయుడుగూడెం గ్రామాన్ని రాష్ట్రంలో మొదటి వైఫై గ్రామంగా తీర్చుదిద్దుతానని అమెరికన్ కాన్సులేట్ ఉద్యోగి దేవినేని లక్ష్మీప్రసన్న అన్నారు. శనివారం నాయుడుగూడెం విచ్చేసిన ఆమె విలేకరులతో మాట్లాడారు. తానా సభ్యులు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటామని ప్రకటించారని.. దీనిలో భాగంగా తాను నాయుడుగూడెం గ్రామాన్ని ఎంపిక చేసుకున్నట్టు చెప్పారు. నిధులిచ్చి చేతులు దులుపుకోకుండా తర్వాత తరం కూడా గ్రామంలో అభివృద్ధి కొనసాగించాలన్నదే తన అభిమతమన్నారు. స్థానిక నాయకులు కట్నేని లక్ష్మీనారాయణ చౌదరి, గ్రామపెద్దల సహకారంతో ముందుకు వెళతానని చెప్పారు. తన అభిమతాన్ని ఇలా వెల్లడించారు.

 

 నాయుడుగూడెం గ్రామాన్నే ఎందుకు ఎంచుకున్నారు.

 నాయుడుగూడెం మా తాతగారి అమ్మవాళ్ల ఊరు. ఇక్కడికి తరచుగా వచ్చి వెళుతుంటాను. చిన్నతనంలో ఐదారేళ్లు ఇక్కడే పెరిగారు. మా పిన్ని వాళ్ల ఊరు కూడా ఇదే కావడంతో దీనిని ఎంపిక చేసుకున్నా.  

 

 ఇందుకు ఎవరు స్ఫూర్తి

 మా తాత నందిగం వెంకయ్య సర్పంచ్‌గా 15 ఏళ్లు పనిచేశారు. గ్రామానికి ఆయన సేవలు అందించడంతో నాకు సేవ చేయాలని అనిపించింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రోత్సాహం కూడా కారణం.  

 

 గ్రామస్తుల సహకారం ఎలా ఉంటుందని భావిస్తున్నారు  

 మా పిన్ని గతంలో పంచాయతీ బోర్డు మెంబర్‌గా ఉన్న సమయంలో సర్పంచ్ కట్నేని సరోజినికి సహకారం అందించి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు. నేను గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పగానే వారంతా ముందుకు వచ్చారు.

 

 ఏ రంగాల్లో అభివృద్ధి చేయాలకుంటున్నారు

 ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఎలాంటి వైర్లు లేకుండా ఇంటర్నెట్ అందించే వైఫై టెక్నాలజీని అభివృద్ధి చేస్తాం. గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తా. ప్రతి ఒక్కరికి పనికల్పించేందుకు కృషిచేస్తాను. మంచినీటి చెరువులను పునరుద్ధరిస్తా. చెరువు గట్లపై పార్కుల ఏర్పాటుకు కృషిచేస్తా. ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తా.  

 

 మహిళల అభివృద్ధికి ఏం చేస్తారు

 కుటుంబాలు అభివృద్ధి చెందేందుకు మహిళలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తా. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించడం ద్వారా ఆర్థికంగా బలోపేతం అయ్యేలా చేస్తాను.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top