ఏజెన్సీలో ‘దళ’జడి

ఏజెన్సీలో ‘దళ’జడి - Sakshi


జంగారెడ్డిగూడెం :పశ్చిమ ఏజెన్సీలో అన్నల అలజడి రేగింది. సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) చంద్రన్న వర్గంలోని అశోక్ దళానికి చెందిన సభ్యులు ఆయుధాలతో ప్రయాణం చేస్తున్నారనే కచ్చితమైన సమాచారంతో పోలీసు బలగాలు చుట్టుముట్టి మంగళవారం వేకువజామున 11 మందిని వలపన్ని పట్టుకున్నాయి. అనంతరం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మొత్తం 13 మందిని జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు పట్టుబడిన వారంతా గతంలో రాయల సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ)లో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆ పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తడంతో సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) పార్టీ రెండుగా చీలిపోయింది. అలా విడిపోయిన ఒక వర్గం గాదె దివాకర్ నాయకత్వంలో పనిచేస్తుండగా, మరో వర్గం సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) చంద్రన్న వర్గంగా ఏర్పాటైంది.

 

 ఈ నేపథ్యంలో జిల్లాలో టి.సుధాకర్ నాయకత్వంలో గాదె దివాకర్‌కు సంబంధించిన వర్గం పనిచేస్తోంది. విడిపోయిన చంద్రన్న వర్గంలో మోకల మురళీకృష్ణ జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. చంద్రన్న వర్గం సాయుధ దళం ఏర్పాటుకు పూనుకుంది. కొంతమంది గిరిజన యువకులను ఎంపిక చేసుకుని ఖమ్మం జిల్లా బయ్యారం అడవుల్లో ఆయుధాలను ఉపయోగించడంలో ఏడాదిన్నర కాలంగా శిక్షణ ఇస్తున్నట్లు  తెలిసింది. ఇందులో భాగంగానే మంగళవారం వేకువజామున 11 మంది వ్యక్తులు ఆయుధాలు తీసుకుని టాటా ఏస్ వాహనంలో ఈ ప్రాంతానికి వస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక సాయుధ బలగాలతోపాటు జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, లక్కవరం స్టేషన్లకు చెందిన పోలీసులు జంగారెడ్డిగూడెం సమీపంలోని జీలుగులమ్మ గుడి వద్ద మాటువేసి అత్యంత చాకచక్యంగా 11 మంది దళ సభ్యులను అరెస్ట్ చేశారు.

 

 వారిలో దళ కమాండర్ కుంజా రవి, డెప్యూటీ దళ కమాండర్ పడిగ సురేష్, సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) జిల్లా కార్యదర్శి మోకల మురళీకృష్ణతోపాటు ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన కెచ్చెల పండు అలియాస్ ప్రభాకరరావు, కరకాల రాము అలియాస్ రామన్న, మహమ్మద్ అబ్దుల్ రషీద్, అమరాజు గట్టయ్య, పాయం వెంకటేష్ అలియాస్ మురళి, బడపటి వీరన్న, తుంగా జాన్ అలియాస్ నాగన్న, కొక్కెర వెంకటేష్ అలియాస్ శింగన్న ఉన్నారు. వీరందరినీ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు వారిని విచారించారు. అనంతరం బుట్టాయగూడెం మండలం తూర్పురేగులకుంటలో నివాసం ఉంటున్న కైకాల సూర్యనారాయణను, తలారి ప్రకాష్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరితో కలిపి మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. దళ సభ్యుల నుంచి 9 తుపాకులు, 344 తూటాలు, విప్లవ సాహిత్యంతోపాటు ఒక టాటా ఏస్ వాహనం, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సీ కె.రఘురామ్‌రెడ్డి తెలిపారు.

 

 రక్తపాతం జరక్కుండా పోలీస్ ఆపరేషన్

 ఆయుధాలతో దళాలు ప్రయాణం చేస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు అత్యంత చాకచక్యాన్ని ప్రదర్శించారు. సాయుధులైన వారిని అరెస్ట్ చేసే సమయంలో సాధారణంగా ప్రతిఘటన ఎదురవుతుంది. పోలీసులు పక్కా వ్యూహంతో ఒక్క బుల్లెట్ కూడా ఉపయోగించకుండా మొత్తం 13 మంది దళ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. గతంలో సాయుధ దళసభ్యులను పట్టుకునే విషయంలో ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర ప్రతిఘటనలు ఎదురయ్యేవి. ఈ దశలో ఎదురు కాల్పులు జరిగి ప్రాణ నష్టం సంభవించేది. తాజా ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పోలీసులు దళ సభ్యులను అరెస్ట్ చేశారు. పోలీసులకు చిక్కన వారిలో న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న మోకల మురళీకృష్ణ ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని పందిపంపు గ్రామ సర్పంచ్‌గా ఇటీవల ఎన్నికయ్యారు. ఈయన గతంలో రాజస్థాన్‌లో అక్రమ ఆయుధాల కేసులో అరెస్టయ్యారు. ఇతనిపై పలు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

 

 కోవర్టు పనేనా?

 చంద్రన్న వర్గంలోని అశోక్ దళానికి చెందిన 13 మంది సభ్యులు పట్టుబడటం వెనుక కోవర్టుల హస్తముందని పలువురు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లా బయ్యారం అడవుల్లో ఆయుధాలను వినియోగించడంపై శిక్షణ పొంది టాటా ఏస్ వాహనంలో దళ సభ్యులు జీలుగుమిల్లి మీదుగా వస్తున్నారనే కచ్చితమైన సమాచారాన్ని పోలీసులకు చేరవేయడం కోవర్టులకే సాధ్యమవుతుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం ఈ దళం సాగిస్తున్న కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా వేశామని, పక్కా సమాచారంతో దాడి చేసి దళ సభ్యులను వలపన్ని పట్టుకున్నామని చెబుతున్నారు.

 

 ‘దళ సభ్యుల అరెస్ట్ అక్రమం’

 ఏలూరు(బిర్లాభవన్ సెంటర్) : సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) చంద్రన్న వర్గం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం అక్రమమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి టి.సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వస్తుంటే అరెస్ట్ చేశారన్నారు. వారితోపాటు ఆ సమావేశంలో పాల్గొన్న వారిని కూడా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. దీనిని అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని తక్షణమే విడుదల చేయాలని సుధాకర్ డిమాండ్ చేశారు.

 

 ప్రత్యేక నిఘా : ఎస్పీ

 జంగారెడ్డిగూడెం : రాష్ట్ర విభజన నేపథ్యంలో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో దళ సభ్యుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ జి.రఘురామ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాదిన్నర కాలంగా  సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) చంద్రన్న వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు దళాలను ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పనిచేయడానికి నిర్ణయించుకున్నట్టు తమకు సమాచారం అందిందన్నారు. వారంతా కాంట్రాక్టర్లు, రైతులు, వ్యాపార వర్గాల నుంచి చందాలు వసూలు చేస్తున్నారనే సమాచారం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వీరిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దళ సభ్యులు టాటా ఏస్ వాహనంలో వస్తున్నట్టు సమాచారం అందటంతో పోలీసులు వారిని అత్యంత చాకచక్యం, ధైర్య సాహసాలు ప్రదర్శించి ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లకుండా పట్టుకున్నారన్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందికి అవార్డులు, రివార్డులకు సిఫార్సు చేస్తున్నట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి మన జిల్లాలో కొత్తగా కుకునూరు, వేలేరుపాడు మండలాలు కలిసిన దృష్ట్యా మావోయిస్టుల కదలికలపైనా గట్టి నిఘా పెట్టామని చెప్పారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు, బలవంతపు వసూళ్లకు పాల్పడితే అటువంటి వారి వివరాలను పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ సూచించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, చింతలపూడి సీఐ రమేష్ పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top