చంద్రబాబుకు జనాలు ఊహించని షాక్‌!






విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నవ నిర్మాణ దీక్షను ప్రారంభించారు. రాష్ట్ర విభజనతో అన్యాయమైపోయిన ఏపీ రాష్ట్ర పునర్‌ నిర్మాణమే లక్ష్యంగా ఆయన ఇవాళ విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఏడు రోజుల పాటు ఈ దీక్షను ఆరంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..జూన్‌ 2వ తేదీని  చీకటి దినంగా  అభివర్ణించారు.


రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించే ప్రత్యేకహోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి  ఒప్పుకున్నానని ఆయన అన్నారు. ప్రత్యేకహోదాలో ఉన్న అన్నింటిని ప్యాకేజీలో ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా నేతలు, ప్రజలతో ముఖ్యమంత్రి నవ నిర్మాణ ప్రతిజ్ఞ చేయించారు.  



మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు ఊహించని షాక్‌ ఇచ్చారు.  తాను తలపెట్టిన దీక్ష కోసం జనాల నుంచి అపూర్వ స్పందన వస్తుందని భావించి దీక్షా ప్రాంగణం వద్ద భారీగా కుర్చీలు వేశారు. . కానీ దీక్ష మొదలైనప్పటికీ...జనం ఆశించిన స్థాయిలో రాలేదు. అలాగే చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించే సమయానికి వచ్చిన మహిళల్లో కూడా ఎక్కువ మంది ఎండ వేడిమి తట్టుకోలేక వెళ్లిపోయారు. దీనికితోడు చంద్రబాబు ప్రసంగం దాదాపు గంటన్నర సేపు సాగడంతో వచ్చిన వారికి ఏం చేయాలో తెలియక, ఎండకు తట్టుకోలేక అక్కడి నుంచి వెనుదిరిగారు. దీంతో ప్రతిజ్ఞ, ప్రసంగ సమయంలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. దీంతో స్థానిక నేతలు చేసేదేమీ లేక వేసిన కుర్చీలన్నింటినీ  తీయించేశారు.



అలాగే వైఎస్‌ఆర్‌ జిల్లాలోనూ నవ నిర్మాణ దీక్ష అట్టర్ ఫ్లాప్ అయ్యింది. చంద్రబాబు నాయుడు ఎంతో ఆర్భాటంగా ప్రజలంతా దీక్ష చేయాలంటూ నానా హంగామా చేస్తే....జిల్లా ప్రజల నుంచి మాత్రం ఆశించిన స్పందన కనిపించలేదు. జిల్లా కేంద్రం కడపలోని ఏడు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన దీక్షకు డ్వాక్రా, ఉపాధి హామీ మహిళలను బలవంతంగా తరలించారు. తప్పనిసరి పరిస్థితుల్లో హాజరైన ఆ మహిళలు తప్ప స్థానికులు ఎవ్వరూ దానిలో పాల్గొనక పోవడం విశేషం.



Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top