కొడుకుతో పాటు మమ్మల్ని చంపేస్తే బాగుండేది

కొడుకుతో పాటు మమ్మల్ని చంపేస్తే బాగుండేది - Sakshi


పసుపునీళ్ల కార్యక్రమంలో రోదించిన నరేశ్ తల్లిదండ్రులు



కొయ్యూరు : ఈనెల 13న మావోయిస్టుల చేతిలో మరణించిన నరేశ్‌కు మంగళవారం పసుపునీళ్లు కార్యక్రమం చేపట్టారు. దీంతో  తల్లిదండ్రులు, బంధువులు దుఖాన్ని ఆపుకోలేకపోయారు. ‘మీరు వస్తే  మూటలు కట్టిన బియ్యాన్ని వండిపెట్టాము. అభిమానంంతో అన్ని చేశాము. ఎన్నోసార్లు ఆకలిని తీర్చాము.. చివరకు అభిమానం ఎక్కువై కన్నపేగును లేకుండా చేశార’ంటూ నరేశ్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. నరేశ్‌తో పాటు తమను కూడా తీసుకుపోయి చంపేస్తే బాగుండేదని, కొడుకు లేని క్షోభను ఎన్నాళ్లు భరించాలని ఆవేదన చెందారు. భూమిని కౌలుకు తీసుకుని మొక్కజొన్న, గంటి, వరి వేస్తున్నామన్నారు.

 

అయినా బతకడం కష్టం కావడంతో కట్టెలు అమ్ముతున్నామని తెలిపారు. ఎండకోట, గొంధికోట, ఈదులబంద, డబ్బలంక గ్రామాలకు చెందిన కొందరు తామంటే పడక మావోయిస్టులకు లేనిపోనివి చెబుతున్నారని వాపోయారు. నరేశ్ తమ్ముడు మహేశ్‌పై కూడా కొందరు మావోయిస్టులకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఎండకోటలో ఉండలేని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందారు. ఎండకోటలో ఏడున్నర ఎకరాల భూమిని,ఆస్తులను వదిలిపెట్టి ఇక్కడ కూలి పనులు చేసుకుని బతకాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు వై.రామవరంలో కూడా ఉండవద్దని, ఉంటే దాడి చేస్తామని కొందరు చెబుతున్నారని వాపోయారు. భర్త లేకుండా తానెలా బతకాలంటూ నరేశ్ భార్య హేమలత ప్రశ్నించింది.

 

తాను హోంగార్డు లేదా ఇన్‌ఫార్మర్‌గా పనిచేయడం లేదని లొంగిపోయి జీవనం సాగిస్తున్న కవిత చెప్పింది. ఆశ వర్కర్‌గా పనిచేస్తున్న తనపై కొందరు కక్ష కట్టి మావోయిస్టులకు  తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. మహిళలు హోంగార్డుగా పనిచేయడం సాధ్యం కాదన్నారు. పోలీసులు - మావోయిస్టుల మధ్య అనుమానాలతో తాము చిత్రవధకు గురువుతున్నామన్నారు. మువ్వల అప్పారావు, కొర్రా భాస్కరరావు సైతం తాము ఇన్‌ఫార్మర్లము కాదని, మావోయిస్టులు వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నారు. మావోయిస్టులు కొన్ని గ్రామాల ప్రజల మాటలు నమ్మి నరేశ్‌ను చంపారన్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు వాస్తవాలు గ్రహించాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top