కనిపించని నారాయణ

కనిపించని నారాయణ - Sakshi


వినిపించని  అభివృద్ధి పారాయణ

పూటకో నజరానాతో రాజధాని గ్రామాలలో  హడావుడి

పని పూర్తయ్యాక పత్తాలేని వైనం

విడుదలకు నోచని   గ్రామాలకు  ప్రకటించిన సాయం


 

భూ సమీకరణ వేగంగా పూర్తి చేయడానికి మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ అనేక గిమ్మిక్కులు చేశారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా రాజధాని గ్రామాల్లో పర్యటించారు. మీతోనే.. నేను అంటూ ప్రజలతో మమేకమయ్యారు. చెట్ల కింద భోజనాలు చేశారు. సమీకరణకు సహకరించిన నేతలు, గ్రామస్తులను సత్కరించారు. వారి నుంచి తానూ సత్కారాలు పొందారు.     గుర్రమెక్కి ఊరేగారు. భూ సమీకరణ ముందుగా పూర్తి చేసిన గ్రామాలకు నజరానాలు     {పకటించారు. ఇంత హడావుడి చేసిన మంత్రి భూ సమీకరణ కార్యక్రమం పూర్తయిన తరువాత ఒట్టు తీసి గట్టుమీద పెట్టిన రీతిలో వ్యవహరించారు. అమరావతి శంకుస్థాపన తరువాత రాజధానివైపు కన్నెత్తి చూడటం లేదు.         -సాక్షి ప్రతినిధి, గుంటూరు

 

రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూ సమీకరణ నోటిఫికేషన్‌ను మొదట్లో అన్ని గ్రామాల రైతులు పూర్తిగా వ్యతిరేకించారు. ఈ విధానంపై అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం టీడీపీ గ్రామాలను ఎంచుకుంది. మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అక్కడి  టీడీపీ నేతలు, కార్యకర్తలను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనా విధానంపై అవగాహన కలిగించారు. రైతుల నుంచి భూ సమీకరణకు వ్యతిరేకత లేకుండా చూసే బాధ్యతను స్థానిక నేతలకు అప్పగించారు. తొలుత తుళ్ళూరు మండలంలోని టీడీపీ అనుకూల గ్రామాలను ఎంచుకున్నారు. ముఖ్యంగా నేలపాడు, ఐనవోలు, శాఖమూరు, తుళ్ళూరు, దొండపాడు, బోరుపాలెం, అబ్బురాజుపాలెం తదితర గ్రామాల రైతులను మంత్రి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్‌కుమార్‌లు ఎక్కువగా కలిశారు.



ఉత్సాహపరిచి.. ఆనక నీరుగార్చి..

మంత్రి నారాయణ రాజధాని గ్రామాల్లో రేయింబవళ్లు పర్యటించారు. గ్రామాల్లోని వార్డు స్థాయి నాయకుడిని కూడా కలిసి భూ సమీకరణ కార్యక్రమానికి మనమంతా సహకరించాలి... ప్రపంచం మెచ్చే రాజధానిని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్న సీఎం చంద్రబాబుకు మనమంతా అండగా ఉందాం..రాజధాని నిర్మాణంతో మనమూ.. పెరుగుదాం అంటూ వారిని ఉత్సాహ పరిచారు. భూ సమీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన గ్రామాలకు నజరానాలు ప్రకటించారు. ఒకో గ్రామానికి రూ.30 లక్షలను ప్రభుత్వం నుంచి సహాయంగా ఇప్పిస్తానని, డ్రైనేజి, రక్షిత మంచినీటి సరఫరా, వీధిలైట్ల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎల్‌ఈడీ బల్బులు వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. అధికారులతో యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనలు తయారు చేయించారు. దీనితో తుళ్ళూరు మండల పరిధిలోని నేలపాడు, ఐనవోలు గ్రామాలు 99 శాతం భూములను రెండు నెలల్లోపే భూ సమీకరణకు అందించాయి. మిగిలిన గ్రామాలు అటు ఇటుగా భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చేశాయి.

 

 నాయకుల్లో అసహనం..


 భూ సమీకరణ పూర్తయి నాలుగు నెలలు గడిచినా మంత్రి నారాయణ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రతిపాదనలన్నీ అటకెక్కాయి. ముందుగా భూములు ఇచ్చిన గ్రామాలకు మంత్రి ప్రకటించిన రూ.30 లక్షల సహాయం ఇంకా విడుదలకాలేదు. ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి. రాజధానిలోని అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బుల సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీ కొన్ని గ్రామాల్లోనే అమలు పరిచారు. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలు ఏ దశలో ఉన్నాయో తెలి యని పరిస్థితి. దీనికితోడు నిత్యం రాజధాని గ్రామాల ప్రజలతో మమేకం అయిన నారాయణ శంకుస్థాపన తరువాత అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిణామాలకు భూములు ఇచ్చిన రైతులు కలవరం చెందుతుంటే, పచ్చని పంటలు పండే మాగాణి భూముల్లో పెరిగిన పిచ్చి మొక్కల్ని చూసి టీడీపీ నేతలు తప్పుచేశామనే భావనతో మధనపడుతున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top