నానో టెక్నాలజీతో ఎన్నో ప్రయోజనాలు


మదనపల్లెక్రైం: ప్రపంచంలో నానో టెక్నాలజీ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, దీనిపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. సూక్ష్మ పదార్థాల ద్వారా వస్తు తయారీ విధానాన్ని అధ్యయనం చేసేందుకు స్థానిక బీటీ కళాశాలలో బుధవారం రూల్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ బయోసెన్సైస్‌పై జాతీయ సద స్సును ప్రారంభించారు. ముందుగా బీటీ కళాశాల వ్యవస్థాపకురాలు అనిబి సెంట్ విగ్రహానికి పూలమాల వేసి, ఘన నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో రెండు రోజుల సెమినార్‌ను ప్రారంభించారు.



మొదటి రోజు పలు ప్రాముఖ్యమైన విషయాలపై ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మిట్స్ కాలేజ్ కరస్పాండెంట్ నాదేళ్ల విజయభాస్కర్‌చౌదరి మాట్లాడుతూ నానో టెక్నాలజీ విస్తరిస్తున్న సమయంలో జాతీయ స్థాయి సెమినార్ బీటీ కళాశాలలో నిర్వహించ డం గర్వంగా ఉందన్నారు. చైర్‌పర్సన్ ప్రొఫెసర్ లక్ష్మణరావు మాట్లాడుతూ నానోసైన్స్, నానో టెక్నాలజీని ఉపయోగించి పదార్థాలను సూక్ష్మస్థాయిలో సృష్టించి వాటి భౌతిక, రసాయనిక, జీవశాస్త్ర, విద్యుత్, దృశ్య, ఎలక్ట్రానిక్, యాంత్రిక ధర్మాలను అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు.



వ్యవసాయ, వైద్య, వాతావరణ పరిశోధక, సమాచార రంగాలను నానో టెక్నాలజీ ద్వారా అనువర్తించనున్నట్లు పేర్కొన్నారు. నానో టెక్నాలజీ ద్వారా పదార్థాన్ని, శక్తిని, స్థలాన్ని పొదుపు చేయవచ్చన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని తెలిపారు. ఈ సదస్సులో పాఠశాల ప్రిన్సిపాల్ కిజర్ మహ్మద్, వైస్ ప్రిన్సిపాల్ స్వర్ణరాణి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుగుణమ్మ, ఆదిత్య కాలేజ్ రామలింగారెడ్డి, ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓఎండీ హుస్సేన్, హెచ్‌వోడీ శివరామయ్య, శ్రీకుమార్, రాయలసీమ జిల్లాల్లోని ప్రొఫెసర్లు, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top